కరోనా వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకాపై ఇండోనేషియాలో కొత్త దుమారం మొదలైంది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ హరామ్ అంటూ ఇండోనేషియా అత్యున్నత ముస్లిం మత పెద్ద కౌన్సిల్, ఇండోనేషియా ఉలేమా కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. పంది ప్యాంక్రియాస్ నుంచి తీసిన ట్రిప్సిన్ ఉపయోగిస్తూ.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తోంది. దీంతో ఆ వ్యాక్సిన్ వాడకంపై అక్కడ సందేహాలు నెలకొన్నాయి.
మరోవైపు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై వదంతులను ఖండిస్తూ కంపెనీ ప్రకటన విడుదల చేసింది. తమ వ్యాక్సిన్‌లో పంది మాంసం సంబంధిత పదార్థాలు వినియోగించలేదని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రక్రియలో ఏ దశలోనూ పంది, అలాగే ఏ ఇతర జంతు ఉత్పత్తులతో సంబంధం కలిగి లేదని వెల్లడించింది. కాగా ఇప్పటికే యురప్ లో వ్యాక్సిన్ తీసుకున్న కొంతమందిలో రక్తం గడ్డ కడుతోందంటూ ఆరోపణలు రావడంతో పలు దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకాన్ని తాత్కాలికంగా నిషేధించాయి..