న్యూఢిల్లీ : వరస వరదల వంతు ఈసారి యమునది. ప్రమాదకర స్ధాయిని మించి యమునా నదిలో వరద వచ్చి చేరుతోంది. వర్షాలు విస్తారంగా కురియడంతో ఎగువనుంచి వచ్చిన నీటితో యమున ఉరకలెత్తి పారుతోంది. నదిలో ప్రవాహం ప్రస్తుతం 206.40 మీటర్లకు చేరినట్టు అధికారులు ప్రకటించారు. పాత ఢిల్లీ ఇనుప వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. యమునా నదిపై రైళ్ళ రాకపోకల దారి మళ్ళించారు. మరో 12 గంటల్లోగా వరద ప్రవాహం 207.08 మీటర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముంపు ప్రజల కోసం టెంట్లు,షెల్టర్లను ఏర్పాటు చేశారు. రెస్క్యూ బోట్లు, డ్రోన్ల సహాయం తీసుకుంటున్నారు. వరద ఉధృతి కనీసం రెండు రోజులు వుంటుందని అంచనా.