”ఆర్‌జీఎన్‌ఎఫ్ నిధులకు సంబంధించి మీరు పంపిన వేర్వేరు యుటిలైజేషన్ సర్టిఫికెట్లలో పొందుపర్చిన గణాంకాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయి…సర్టిఫికెట్లలో ఒకదానిలో రూ.41,07,381 అని, మరోదానిలో రూ.47,79,472 అని పొందుపర్చారు… మీరు పంపిన సర్టిఫికెట్లు అవినీతి, అక్రమాలను ఎత్తిచూపుతున్నాయి…ప్రజాధనంతో నడిపే ఇలాంటి పథకాల అమల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం నేరం… దీన్ని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం… తక్షణం మీరు వాస్తవాలతో కూడిన యూసీలను సమర్పించి కేసును పరిష్కరించుకోండి” ఎస్వీయూ పరిపాలన భవనంలో రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ నిధుల వినియోగంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలను తెలుపుతూ యూజీసీ రాతపూర్వకంగా చేసిన వ్యాఖ్యలివి.
పరిశోధన రంగంవైపు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో రాజీవ్‌గాంధీ నేషనల్ ఫెలోషిప్(ఆర్‌జీఎన్‌ఎఫ్) పథకాన్ని దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టింది. పథకం కింద విద్యార్థులకు ఫెలోషిప్పులను యూజీసీ మంజూరు చేస్తుంది. పథకంలోని పరిశోధకులను జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్), సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్)లుగా విభజించి ఐదేళ్ల పాటు ఫెలోషిప్పులను మంజూరు చేస్తున్నారు. వీటన్నింటికీ నిధులను యూజీసీనే సమకూరుస్తోంది. పథకం కోసం యూజీసీ విడుదల చేసే నిధులన్నింటిని ఆయా వర్సిటీల ఖజానాకు జమచేసి వర్సిటీ ద్వారానే విద్యార్థులకు ఫెలోషిప్పులను ఇప్పిస్తుంది. అనంతరం విడివిడిగా పరిశోధక విద్యార్థుల నుంచి పూర్తిస్థాయిలో నిధుల వినియోగానికి సంబంధించిన బిల్లులను తెప్పించుకుని, తుదిగా విశ్వవిద్యాలయ యాజమాన్యమే మొత్తం నిధులకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్ల(యూసీ)ను యూజీసీకి పంపాలి. నిబంధనలన్నింటినీ ఆర్‌జీఎన్‌ఎఫ్ విధివిధానాల్లో పొందుపర్చారు.
15మంది 2009-10బ్యాచ్ వారే
ఆర్‌జీఎన్‌ఎఫ్‌కు సంబంధించి ఎస్వీయూ అధికారులు యూజీసీకి పంపిన యూసీలు 2009-10 బ్యాచ్‌కు చెందిన పరిశోధక విద్యార్థులవి. వీరి ఫెలోషిప్ కాలం 2014లో ముగిసింది. నాలుగేళ్ల పాటు వీరంతా ఫెలోషిప్పులను పొందారు. చివరగా 2013-14 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫెలోషిప్పులు ఆగిపోయాయి. ఆఖరి ఏడాదికి ఒక్కో పరిశోధక విద్యార్థికి దాదాపు మూడు లక్షల రూపాయలు జమకావాల్సి ఉంది. చివరి సంవత్సరానికి సంబంధించిన యూసీలను పరిశోధక విద్యార్థుల నుంచి విడివిడిగా తీసుకున్న ఎస్వీయూ వాటిని సరైన పద్ధతిలో గణించి యూజీసికి నివేదించే క్రమంలోనే అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. యూజీసీకి పంపిన యూసీల్లో ఒకదాంట్లో రూ.41,07,381 అని, మరో దాంట్లో రూ.47,79,472అని పొందుపర్చారు. గణాంకాల్లో పొంతన లేకపోవడంతో యూజీసీ వీటిని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో పరిశోధకులకు రావాల్సిన నిధులు ఆగిపోయాయి. 2014నుంచి గడిచిన ఐదేళ్ల పాటు పరిశోధకులు తమకు ఫెలోషిప్ బకాయిలను చెల్లించాలంటూ ఎస్వీయూ పరిపాలన భవనం చుట్టూ తిరుగుతున్నారు.
యూజీసీ పంపందే ఎలా చెల్లిస్తామంటూ ఎస్వీయూ యాజమాన్యం సమాధానమిస్తూ పోతున్నారు. దీంతో పరిశోధకులు చేసేది లేక దిల్లీకి వెళ్లి నేరుగా యూజీసీనే సంప్రదించారు. యూజీసీ మరోమారు ఈ అంశంపై దృష్టి సారించి ఎస్వీయూ పరిపాలన భవనం పంపిన యూసీల్లోని అక్రమాలను బయటపెట్టింది. అంతేకాదు.. యూసీల్లోని అక్రమాలను ఎత్తిచూపుతూ నవంబరు 4వ తేదీన ఎస్వీయూకు లేఖరాసింది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకుని వాస్తవ గణాంకాలతో కూడిన యూసీలను పంపాలంటూ యూజీసీ ఆదేశించింది.
తప్పించుకోలేక తలలు పట్టుకున్న వైనం
యూజీసీకి సమర్పించిన యూసీల్లో అక్రమాలు బయటపడటం, ఏకంగా యూజీసీనే లేఖ రాయడంతో ఎస్వీయూ అధికారులు తలలు పట్టుకున్నారు. అక్రమాలకు కారకులెవరనేదాన్ని తేల్చలేక ఒకరికపై మరొకరు నెపం వేసుకుంటున్నారు. పరిపాలన భవనంలోని డెవలప్‌మెంట్ విభాగం కేంద్రంగా ఈ మొత్తం వ్యవహారం నడిచింది. ఈ విభాగంలో గతంలో పనిచేసిన వారు బదిలీ అయ్యారు. ప్రస్తుతం పనిచేస్తున్నవారు బదిలీ అయిన వారిపై, బదిలీ అయిన వారు మాకేం సంబంధం అంటూ యూజీసీ గుర్తించిన అక్రమాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.