అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న ఏలూరు వాసుల కష్టాలు ఇంకా తీరటం లేదు. అసలు ఆ వ్యాధికి గల కారణాలపై విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. మూర్చ రోగ కారణాలపై బాధితులంతా ఆసుపత్రులకు వస్తూనే ఉన్నారు. డిశ్చార్జ్ అయిన వారిలోనూ ఇవే లక్షణాలు మళ్లీ కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో లోతైన విశ్లేషణ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు రక్త నమూనాల్ని పంపారు. ప్రాథమికంగా గుర్తించిన వివరాల ప్రకారం సీసం, నికెల్ అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధుల బృందం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కు చెందిన బృందం, ఎయిమ్స్ బృందం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులతో పాటు ప్రభావిత ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లోని నమూనాల్ని సేకరించాయి. కూరగాయాలను తాజాగా ఉంచటానికి వాడే రసాయనాలు, పంటలపై చల్లుతున్న పురుగుమందులు కొంత వరకూ వింత రోగానికి కారణమై ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా, వీటిపై పూర్తి వివరాలను శాస్త్రీయంగా నిర్ధారించనున్నారు.
ఇక నీరు వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో… పురపాలక శాఖ సరఫరా చేస్తున్న పంపునీటిని తాగవద్దని స్థానికులకు అధికారులు సూచించారు. పళ్లు, కాయగూరలను సైతం ఉప్పు నీటితో కడిగిన తర్వాతే వాడుకోవాలని సూచించారు.
ఇక వింత మూర్చ వ్యాధి కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 561కి పెరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 81మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 450మంది డిశ్చార్జ్ కాగా, మెరుగైన చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు 29 మంది రోగుల తరలించారు.