ఓ వైపు బాలికలు, యువతులు,మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి శిక్షలు పడుతున్నాయి. మరో వైపు మానవ మృగాళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అబలల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నారు. కూతురులాంటి బాలికల భవిష్యత్తును చిదిమేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో చోటుచేసుకున్న ఈ ఘటన అలాంటిదే. కంప్యూటర్ పాఠాలు నేర్చుకోవటానికి వచ్చిన ఒక బాలిక ను ఇంటర్నెట్ కేంద్రం నిర్వాహకుడు వంచించాడు. పలు మార్లు లైంగిక దాడి చేయటంతో ఆమె గర్భవతి అయింది. విషయం వెలుగులోకి రాకుండా చేసేందుకు గర్భవిచ్ఛిత్తికి యత్నించాడు. అయితే అసలు విషయం వెలుగులోకి రావటంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం నిందితుడిని అరెస్టు చేశారు.
ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన ఓ బాలిక రాజాం నియోజకవర్గంలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి ఇంటర్మీడియేట్ చదువుకుంటోంది. కంప్యూటర్ కోర్సు నేర్చుకొనేందుకు రాజాం పట్టణంలోని ఒక ఇంటర్నెట్ కేంద్రంలో చేరింది. నెట్ సెంటర్ నిర్వాహకుడు బాలికపై కన్నేశాడు. మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు. లైంగిక దాడి చేయటంతో ఆమె గర్భం దాల్చింది.
ఈ క్రమంలో అనారోగ్యానికి గురవటంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైన వైద్యులు బాధితురాలిని చూసి దిశ పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. మహిళా ఎస్‌ఐ విషయంపై ఆరా తీయటంతో నిందితుడి గుట్టు రట్టయింది. బాలిక చెప్పిన వివరాలతో నిర్ఘాంత పోయారు. రాజాం పోలీసులను అప్రమత్తంగా చేయటంతో రాజాం సీఐ గుండమోను సోమశేఖర్ ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈయన రాజాం నగరపంచాయతీ పరిధిలోని డోలపేటలో నివాసం ఉంటున్నాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి శనివారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.