కళ్ళతో మాట్లాడటం…. మీరెక్కడైనా చూశారా..? అసలు కళ్ళతో అక్షరాలు పలికించడం మీరెక్కడైనా విన్నారా..? కళ్ళతో మాట్లాడం ఏంటి.. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా..? అవును మీరు విన్నది నిజమే. ఆ ఇద్దరు విద్యార్థులు కళ్ళతోనే మాట్లాడుకుంటారు.. కళ్ళతో వారిలో ఉన్న భావాలను బయటకు వ్యక్తం చేయగలరు. వినేందుకు ఇది వింతే అయినా మనం నమ్మకతప్పదు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. పంచేంద్రియాలలో నయనాలకున్న ప్రాముఖ్యత ఎంతో మనందరికి తెలిసిందే. అలాంటి నయనాలతో అద్బుతాలను సృష్టిస్తున్న విద్యార్థినీలపై తొలివెలుగు ప్రత్యేక కథనం.
నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈ ఇద్దరు విద్యార్థుల పేర్లు రమాదేవి, సంతోషి. పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఈ ఇద్దరు విద్యార్థినీలు అంతరించిపోతున్న ప్రాచీన కళకు జీవం పోస్తున్నారు. ఎంతో కష్టతరమైన రాజుల కాలంలో ప్రాచూర్యం ఉన్న నేత్రాభివాదం కళను నేర్చుకున్నారు. రాజుల కాలంలో గూఢాచార వ్యవస్థ ద్వార యుద్ద సైనికులకు సమాచారాలను చేరవేసేందుకు ఈ నేత్రావధానం కళను వినియోగించేవారు. ప్రాచీన కాలంలో వాడకంలో ఉండే ఈ కళను ఇప్పుడు పోతిరెడ్డి పల్లిలోని ప్రభుత్వ పాఠశాల చదివే ఈ ఇద్దరు విద్యార్థులు అలవోకగా చేసేస్తున్నారు. తెలుగులోని ఏ పదాలైనా మనం వీరిలో ఒకరికి రాసిస్తే ఆ పదాలను ఎదురుగా ఉన్న మరో విద్యార్థికి కనుసైగలతో అర్థమయ్యేలా చెయ్యడమే ఈ నేత్రావధానం కళ ప్రత్యేకత.
పాఠశాలలో పనిచేసే ఉపాద్యాయుడు హన్మంతు మొదట ఈ కళకు ఆకర్శితుడై ఆ కళను ఈ ఇద్దరు విద్యార్థినీలకు నేర్పించారు. తెలుగు పండిత్ ఐన హన్మంతు గత సంవత్సరం నుంచి విద్యార్థులకు ఈ కళను నేర్పించాలని తపించాడు. అందుకు పట్టుదల, సాధించాలన్న దీక్ష ఉన్న విద్యార్థుల కోసం అన్వేశించాడు. రమాదేవి, సంతోషి అనే ఈ ఇద్దరు విద్యార్థులను సమ ఉజ్జిలని బావించి వారికి ఈ కళలో శిక్షణనిచ్చారు. కేవలం మూడు నెలల్లోనే ఈ విద్యార్థులు నేత్రావధానం కళపై పూర్తి పట్టు సాదించారని శిక్షణ ఇచ్చిన ఉపాద్యాయుడు హన్మంతు అంటున్నారు. అసలు కళ్ళతో మాట్లాడటం ఎలాగో ఆయన వివరించారు.
ఎంతో ప్రతిభ ఉన్న ఈ చిన్నారులు చాలా వెనకబడిన ప్రాంతమైన పోతిరెడ్డిపల్లిలో నిరుపేద కుటుంబంలో జన్మించారు.కూలీ నాలీ చేసుకుని జీవించే రమాదేవి, సంతోషీల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించి చదివిస్తున్నారు. తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ఇద్దరు విద్యార్థులు ఎంతో మొక్కవోని దీక్షతో సాధన చేసి ఈ కళను పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తున్నారు.