తెలంగాణలో విద్యాసంస్థల మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో.. వివిధ యూనివర్సిటీల్లో పరీక్షల నిర్వహణపై విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. దీంతో ఓయూ, జేఎన్‌టీయూ పరిధిలో రేపటి (బుధవారం) నుంచి జరగాల్సిన పరీక్షలపై అధికారులు స్పష్టత ఇచ్చారు.
ఓయూ పరిధిలో రేపటి నుంచి జరగాల్సిన యూజీ పరీక్షలు, ఇప్పటికే మొదలైన పీజీ, పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే యధావిధిగా జరుగుతాయని ఓయూ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ స్పష్టం చేశారు.
అటు జేఎన్‌టీయూలోనూ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. కరోనా కారణంగా ఎవరైనా పరీక్షలు రాయలేని పరిస్థితి తలెత్తితే ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కాగా వారికోసం నిర్వహించే ప్రత్యేక పరీక్షను కూడా రెగ్యులర్‌గానే పరిగణిస్తామని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.