– ఆగని అడ్డాకల్ ల్యాండ్ మాఫియా ఆగడాలు
– నేనుసైతం ప్రవీణ్ తో బేరసారాలు
– బోర్డులు పీకేసినా కుట్రలు
– రంగంలోకి సీనియర్ జర్నలిస్టు
అనుమతుల్లేవు.. నిబంధనలు పట్టవు.. అదేమని అడిగితే బెదిరింపులు. అడ్డాకల్ ల్యాండ్ మాఫియా సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. ఫామ్ ప్లాట్స్ పేరుతో అక్రమ దందాకు తెరతీసి.. నేనుసైతం పోరాటం, తొలివెలుగు కథనాలతో కంగుతిని తోకముడిచి, బిచానా ఎత్తేసినా.. ఇంకా ఏదో ఒకటి చేసి భూములు అమ్మేందుకు కుట్ర చేస్తూనే ఉంది ల్యాండ్ మాఫియా. తమ వెనుక బడా నేతలు ఉన్నారు.. కేటీఆర్ బాగా క్లోజ్ అంటూ కొత్త కహానీ వినిపిస్తోంది.
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం శగాపూర్, గుదిబండ గ్రామ పరిధిలో 69 ఎకరాల్లో ల్యాండ్ మాఫియా ఫామ్ ప్లాట్స్ ల పేరిట అక్రమ దందాకు తెరలేపింది. దీనిపై నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ గత నెల 29న పోరాటాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ఈనెల 1న ల్యాండ్ మాఫియా ఫామ్ ప్లాట్లను అమ్మేందుకు ప్రయత్నించింది. ప్రవీణ్ కుమార్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తొలివెలుగు కూడా ఆయన చేస్తున్న పోరాటాన్ని హైలెట్ చేస్తూ కథనాలు ఇచ్చింది. తర్వాత కొన్నాళ్లకు మళ్లీ డీటీసీపీ బోర్డు ఏర్పాట్లు చేసి, భూమిపూజ చేసింది ల్యాండ్ మాఫియా. దీంతో ప్రవీణ్ కుమార్ మరోసారి అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ , పోలీస్ యంత్రాంగం ఎంట్రీ ఇవ్వడంతో తోక ముడిచిన మాఫియా బిచానా ఎత్తేసింది.
కానీ.. రోజుకో కొత్త నాటకంతో వస్తున్న ల్యాండ్ మాఫియా.. తాజాగా తమకు బడా నేతలు తెలుసంటూ పావులు కదుపుతోంది. మంత్రి కేటీఆర్ తో మంచి రిలేషన్ ఉందని.. బాగా క్లోజ్ అంటూ బేరసారాలకు దిగింది. దీని వెనకాల ఉన్న బడా నేతలు తమ బినామీలేనని.. నేనుసైతం ప్రవీణ్ కుమార్ తో చర్చలు జరుపుతోంది. అయితే ఈ బేరసారాలు ఓ సీనియర్ జర్నలిస్టు చేయడం గమనార్హం. ఇటు డీటీసీపీ లేఅవుట్ అని ప్రచారం చేసుకుంటూ.. అక్రమ దందాకు తెరతీసి.. అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఈ ల్యాండ్ మాఫియాపై పోరాటం ఆగదని చెబుతున్నారు ప్రవీణ్ కుమార్.
Advertisements