బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీని ఎన్డీయే సాధించినప్పటికీ మహాఘటబంధన్ లో ఇంకా అధికారంపై ఆశలు చావలేదు. బీహార్‌లో తమ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ పార్టీ శ్రేణులకు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అందుకోసం ఆర్జేడీ ఎమ్మెల్యేలందరూ నెల రోజుల పాటు పాట్నాలోనే ఉండాలని తేజస్వీ యాదవ్ కోరారు. ఎన్డీయే కూటమిలో ఉన్న హెచ్ఏఎం, వీఐపీ ఎమ్మెల్యేలకు తగిన ప్రాధాన్యత ఇస్తేనే వారు కూటమిలో కొనసాగే అవకాశం ఉందని అయన అంచనా వేస్తున్నారు. దీంతో కేబినెట్ ఏర్పడే వరకు వేచి చూద్దామని కామెంట్ చేశారు.
బీహార్ అసెంబ్లీ ఫలితాల్లో ఎన్డీయే కూటమి 125 (బీజేపీ 74, జేడీయూ 43, వీఐపీ 3, హెచ్ఏఎం 4) స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంది. ఇక మహాఘటబంధన్ 110(ఆర్జేడీ 75, కాంగ్రెస్ 19, CPIMLL 11, సీపీఎం 3, సీపీఐ 2) సీట్లు పొందింది.ఇకఎల్జేపీ ఒక స్థానంలో, ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించారు. బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 124.