రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. మెజార్టీ లేని అధికారపక్ష అభ్యర్థి, ఐక్యత లేని ప్రతిపక్షాల తరపు అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అధికారపక్షం తరపున మాజీ డిప్యూటీ ఛైర్మన్, జేడీయూ సభ్యుడు హరివంశ్ బరిలో నిలవగా.., ప్రతిపక్షాల తరపున ఆర్‌జేడీ సభ్యుడు మనోజ్‌ఝా పోటీకి సిద్దమయ్యారు
పెద్దల సభలో అధికార పక్షానికి పూర్తిస్థాయి మెజార్టీ లేదు.కానీ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికపై భారీ కసరత్తే చేసింది. ఎన్డీయేలో లేని పార్టీలతో సంప్రదింపులు జరిపి.. కొందరి మద్దతు కూడా సంపాదించింది. వైసీపీ,టీఆర్ఎస్, జేడీయూతో పాటు పలు పార్టీలతో కలిసి 140 మంది ఎంపీల వరకు మద్దతు లభిస్తుందని బీజేపీ ధీమాగా ఉంది. దీనికి తోడు ప్రతిపక్షాల్లో అనైక్యత హరివంశ్ విజయానికి కలిసి వస్తుందని అధికారపక్షం అంచనా వేస్తోంది. 245మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీయేకు 113 మంది సభ్యుల బలం ఉంది