మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీళ్లు అని ప్రభుత్వం ఐదేళ్లుగా ప్రచారం చేస్తున్నా..అది ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. రాష్ట్ర రాజధానిలో కొన్ని కాలనీలకు తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా అందడం లేదు. తమ దాహం తీర్చండి మహా ప్రభో! అంటూ ప్రజలు రోడ్లెక్కుతున్నారు. అయినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టుగానే ఉందని వాపోతున్నారు.
వినడానికి కొంచెం ఆశ్యర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. హైదరాబాద్ మణికొండలోని అల్కపురి టౌన్ షిప్ వాసులు తాగునీటి కోసం రన్ నిర్వహించారు. దాదాపు 3 కిలో మీటర్ల వరకు ఈ రన్ కొనసాగింది. రన్ లో తమ సమస్యలను తెలిపే ప్లకార్డులను ప్రదర్శించారు.గత ఆరేళ్లుగా తాము తాగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు పలు సార్లు సార్లు ప్రయత్నించామని… ఈ సంవత్సరం ఇది మూడోదని తెలిపారు. సెప్టెంబర్ 22, 2018 లో మానవ హారం, అక్టోబర్ 2, 2019లో మౌన దీక్ష చేపట్టామన్నారు. 4 వేల నివాసాలు, 20 వేల మంది నివసించే టౌన్ షిప్ లో ఇంత వరకు తాగు నీటి సౌకర్యం లేదంటున్నారు. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించుకోవడానికి సంవత్సరానికి దాదాపు 18 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. రెగ్యులర్ గా ట్యాంకర్లు తిరగడం వల్ల రోడ్లు పాడవుతున్నాయని…ట్యాంకర్ నీళ్లు కూడా బోర్ల నుంచి తీసినవి కావడంతో కలుషితంగా ఉంటున్నాయని చెప్పారు. టౌన్ షిప్ లో స్పోర్ట్స్ పార్క్ ట్యాంక్ కు నీళ్ల కనెక్షన్ ఇచ్చి…నేతాజీ పార్క్ సంప్ కు నీటిని సరఫరా చేస్తే సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు మాత్రం ప్రభుత్వ అనుమతి లేనంత వరకు ఎలాంటి పనులు చేపట్టలేమని చెబుతున్నారు.