తిరుమల కొండ పైకి ప్లాస్టిక్ బాటిల్స్‌ను అనుమతించకపోవడంతో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. చెక్ పాయింట్ల వద్దే నీళ్ల సీసాలను తీసేసుకోవడం వల్ల పైకి వెళ్లేసరికి ప్రజలు దాహంతో ఇబ్బందులు పడుతున్నారు.
దీని గురించి భక్తులు మాట్లాడుతూ.. తిరుమల కొండపై పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ ప్లాస్టిక్ నిషేధించడాన్ని స్వాగతిస్తున్నాం కానీ భక్తులకు పూర్తి అవగాహన వచ్చేవరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా టీటీడీ దృష్టి సారించాలన్నారు.
తిరుపతి అలిపిరి టోల్ గేట్ వద్ద బస్సులలో, కార్లలో తిరుమలకు వెళ్తున్న భక్తుల వద్ద ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ను తనిఖీలు చేసి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. అందువల్ల ఘాట్ రోడ్డు ప్రయాణం సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక చోట ప్రత్యామ్నాయంగా *జల ప్రసాదం* త్రాగునీటి కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.
కొండ మీదకు వెళ్లే ప్రతి బస్సు లో అత్యవసర పరిస్థితులలో భక్తులకు అందుబాటులో ఉండే విధంగా కనీసం 10 లీటర్ల వాటర్ క్యాన్ తో పాటు పేపర్ గ్లాసులు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు.
కొండకు సుదూర ప్రాంతాల నుంచి బస్సులలో కార్లలో వచ్చే భక్తులలో అనేక మంది వయస్సులో పెద్దవారు, పసిపిల్లలు కొంతమంది ఆరోగ్యరీత్యా హార్ట్ పేషెంట్లు,బీపీ, షుగర్ ఉన్నవారు ఘాట్ రోడ్ లో ప్రయాణించేటప్పుడు అత్యవసరంగా( మెడిసిన్) టాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చినప్పుడు,ఎండకు దాహం వేసినప్పుడు పసిపిల్లలకు త్రాగునీరు అందుబాటులో లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయన్నారు.
కొండ మీదకు వెళ్లే రెండు నడకదారిలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఏర్పాటు చేసిన త్రాగునీటి సౌకర్యం తరహాలో రెండు ఘాట్ రోడ్ లలో కూడా ఏర్పాటు చేయాలి.
తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధాన్ని అంచలంచలుగా ఎస్వీబీసీ,ప్రైవేట్ ఛానల్ ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తూ భక్తులకు పూర్తి అవగాహన వచ్చేవరకు మరికొన్ని రోజులు గాజు నీటి బాటిల్స్ తో పాటు ప్లాస్టిక్ నీటి బాటిల్స్ ని కొంతమేర అయినా తిరుమలలో అందుబాటులో ఉండేలా టీటీడీ అధికారులు ధర్మకర్తల మండలి పునరాలోచించాలి.
Advertisements
దీని గురించి కొందరు భక్తులు తమ సొంత నిధులతో భక్తులకు మంచి నీటి సౌకర్యం కల్పించేందుకు ముందుకు వచ్చారు. దీనిపై టీటీడీ ధర్మకర్తల మండలి అనుమతుల కోసం చూస్తున్నట్లు వారు తెలిపారు.