డాక్టర్ పరకాల ప్రభాకర్,
రాజకీయ ఆర్థికవేత్త
మన సమాజంలో ఒక అభిప్రాయం ఉంది. ఇంగ్లీషు రాకపోతే మన పిల్లలు ఎందుకూ పనికిరాకుండా పోతారని. తెలుగులో చదువుకుంటే ప్రపంచంలో వస్తున్న నూతన శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు వారికి అందుబాటులోకి రావన్నది కూడా వాస్తవమే. కానీ, దీనికి కారణం మనమే. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల తెలుగు సేతను మనం ఎందుకు చేసుకోవడం లేదు? తక్కిన సమాజాలు అలాకాదే. జపాన్, స్పెయిన్, జర్మనీ, రష్యా, చైనా, ఇజ్రాయేల్ మొదలైన దేశాలలో ఆధునిక విజ్ఞాన సముపార్జనకు ఇంగ్లీషు మీద ఆధారపడడం లేదు. ఏ భాషలో వచ్చినదాన్నయినా చిటికెలో వాళ్ళ భాషల్లోకి అనువాదం చేసేసుకుని పాఠాలు చెప్పేసుకుంటారు. అది మనం చేసుకోవడం లేదు. అందుచేత మనకి ఇంగ్లీషు తప్ప గత్యంతరం లేదనుకుంటున్నాం. ఇది మారాలి. నాకొక పేరాశ ఉంది. ఇప్పుడు తెలుగు చదువుకుంటే మన పిల్లలకి భవిష్యత్తు ఉండదు అనుకునే స్థితి నుంచి తొందరలోనే తెలుగులో చదువుకుంటే మన పిల్లలకి ఏ ఇబ్బందీ ఉండదు అనుకునే పరిస్థితి రావాలి. అక్కణ్ణించి, మన పిల్లలు తెలుగు చదువుకోపోతే వారికి భవిష్యతు ఉండదు అనే స్థితి రావాలి. ఉలిక్కి పడవద్దు. ముందే చెప్పానుగా, పేరాశ అని. దానికి చాలా పరిశ్రమ జరగాలి. ప్రపంచంలో ఎక్కడ ఏ భాషలో ఏ పనికొచ్చేది వచ్చినా చిటుక్కున తెలుగులో మనపిల్లలకు అందుబాటులోకి తెచ్చెయ్యాలి. సంవత్సరానికి ఒకసారయినా మన నిఘంటువులను సవరించుకోవాలి. కొత్త మాటల్ని చేర్చుకోవాలి. కొత్త పదాలను పుట్టించుకోవాలి. పద సంపదను నిత్య నూతనంగా ఉంచుకోవాలి. అప్పుడే తెలుగు తప్ప ఇక ఏ భాషా రాకపోయినా మన పిల్లలు ఏమీ కోల్పోరు. ప్రపంచంలో ఎవరికీ తీసిపోరు. వారి ఎదుగుదలకు భాష ప్రతిబంధకం కాదు. తెలుగు చదువుకోవడం, తెలుగులో చదువుచెప్పడం విషయంలో కూడా మనం పెద్ద తప్పులు చేస్తున్నాం. మన భాషా సమస్యకు మూలం బహుశః అక్కడే ఉంది. తెలుగును విషయాలను వ్యక్తీకరించే సరళ సాధనంగా కాకుండా, సాహిత్య పాండిత్య గరిమను ప్రదర్శించేందుకా అన్నట్టు చూస్తున్నాం. నన్నయ, తిక్కన, పోతన, శ్రీనాధుల ఊసు లేకుండా తెలుగును బోధించడంలేదు. సరళమైన విషయ గ్రహణకు అనువైన తెలుగును బోధించి పిల్లల్ని వదిలితే ముందు తెలుగు నేర్చుకుంటారు. ఆ పై సాహితీ రుచి కలిగినవారు గ్రంధాలు, ప్రబంధాలూ చదువుకుంటారు. లేనివాళ్ళు నిత్యకృత్యాలకి వాడుకుంటారు. ఈవాళ ప్రపంచంలో భాషా బోధన చాలా కొత్త పుంతలు తొక్కింది. తెలుగు భాషా బోధన మాత్రం ఇంకా చిన్నయ సూరి గారి దగ్గరే ఆగిపోయింది. కనీసం గిడుగు వారి దగ్గరకు కూడా చేరలేదు. అందుచేతనే తెలుగు భాషగానే మిగులుతోంది తప్ప విషయ పరిజ్ఞాన గ్రహణకు సాధనంగా మారడంలేదు. ఇది తక్షణం దిద్దుకోవాలి. మన దేశంలో పిల్లల కోసం జరిగే సాహిత్య సృష్టి తక్కువ. తెలుగులో మరీ తక్కువ. దీనికి ముఖ్య కారణం పిల్లల పఠనావసరాల మీద పెద్దవాళ్ళకు అంతగా శ్రద్ధ లేకపోవడమే. మరో ప్రధానమైన కారణం పిల్లల కోసం రాయగలిగే నేర్పరితనం కొరవడడం. పిల్లల్ని ఆకట్టుకునేలా రాసే సామర్ధ్యం చాలా తక్కువ మందికే ఉంది. మన పిల్లలు తెలుగు మరచిపోకుండా ఉండాలంటే వారు చరిత్ర, సామాజిక శాస్త్రాలు బాగా చదువుకోవాలి. వారు అలా చదవాలంటే రాసేవారు కూడా రావాలి. మళ్లీ ఇదంతా ఒక చక్రం.