విజయవాడ : తన ఇల్లు ముంచాలనే కుట్రలో కృష్ణానదీ పరివాహక ప్రాంతాలన్నీ ముంచేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కృష్ణానదికి ఇప్పుడొచ్చిన వరదలు ప్రకృతి వైపరీత్యం వల్ల కాదని.. ఇది ప్రభుత్వ వైపరీత్యమేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఏ రిజర్వాయర్‌లో ఎన్ని నీళ్లు ఉన్నాయో చూసుకోకుండా, వాటిని నింపే ప్రయత్నం చేయకుండా దిగువకు వదిలేశారని, అందుకే ప్రకాశం బ్యారేజీ దిగువన వున్న లంక గ్రామాలు వరదలో మునిగిపోయాయని మాజీ ముఖ్యమంత్రి వివరించారు.సీడబ్ల్యూసీ లెక్కల వివరాలు పూర్తిగా తన దగ్గర ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. దీనిపై గుంటూరు పార్టీ కార్యాలయంలో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు కృష్ణానది 1400 కి.మీ. ప్రయాణిస్తుందని గుర్తుచేశారు. ప్రకాశం బ్యారేజీలో నీళ్లు నేరుగా తన ఇంటి ముందుకు రావాలనేది వైసీపీ నేతల ఆలోచన అని చంద్రబాబు ఆరోపించారు. ‘రాష్ట్రంలో ఎవ్వరికీ నోటీసులు ఇవ్వలేదు. కానీ, మా ఇంటికి మాత్రం వచ్చి ఇచ్చారు. ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా నా నివాసంపై డ్రోన్ ఎగురవేశారు’ అని మండిపడ్డారు. తప్పుడు విధానాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూశారన్నారు. వచ్చిన నీళ్లు సక్రమంగా ఎలా వదలాలో తెలిస్తే చాలని, 20 రోజులు వరద నీరు ప్రవహిస్తుంటే ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. వరదలపై ఏనాడూ జగన్ సమీక్ష చేయలేదని చంద్రబాబు ఆరోపించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 19 గ్రామాల్లో పర్యటించానని, వరద పరిస్థితిని సమీక్షించానని చెప్పారు. ఎక్కడ చూసినా హృదయ విదారక పరిస్థితులు కనిపించాయని అన్నారు. 53 వేల ఎకరాల పంటభూములు నీట మునిగాయని వివరించారు. 30 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలున్నాయని, రూ.3 నుంచి రూ.4 వేల కోట్లు రైతులకు నష్టం కలిగిందని వివరించారు. ఐఎండీ, ఇస్రో హెచ్చరికలు ఉంటే ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. రైతులకు పూర్తి నష్ట పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నెలకు సరిపడా రేషన్ సరకులు ఇవ్వాలని, దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం ఇవ్వాలని కోరారు. పొలాల్లో, ఇళ్లలో బురద తొలగించుకునేందుకు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. కృత్రిమంగా వరదలు సృష్టించిన ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించి బాధితుల్ని పూర్తిగా ఆదుకోవాలన్నారు.