ఒకరిది ఆధిపత్య పోరాటం… మరోకరిది బాస్‌తో శభాష్ అనిపించుకోవాలన్న ఆరాటం… మరోకరిది కడుప మంటతో రగిలిపోతున్న ఆకలి కేకలు. ఇది మిలియన్ మార్చ్ ముఖ చిత్రం. ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలనుకున్న ఆర్టీసీ కార్మికోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది.
ఎలాగైనా తన పంతం నెగ్గించుకోవాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు వెంటనే… బాస్‌ను మెప్పించాలి లేకపోతే… ఇటీవల ఛలో ప్రగతి భవన్ ముట్టడి దగ్గర అయినట్లు సస్పెండ్ అవుతాం అనుకున్నారో ఏమో… వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేసి అమలు చేశారు. శుక్రవారం సాయంత్రం నుండే ముఖ్యనేతల అరెస్ట్‌లు, గృహనిర్భందాలు మొదలయ్యాయి.
కానీ పంతానికన్నా, పోలీసుల బలం-బలగంకన్నా… ఆర్టీసీ కార్మికుల రగులుతోన్న రక్తం మరింత ఆవేశంగా స్పందించింది. పోలీసు నిర్బంధాలను ముందుగానే ఊహించి అప్పటికే వారి వారి ప్రణాళికతో ఛలో మిలియన్ మార్చ్‌కు రెడీ అయిపోయారు.
ట్యాంక్‌బండ్‌కు చేరకుండా ఎంత గస్తీ పెట్టినా… తండోపతండాలుగా కార్మికులు, మద్దతుదారులు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. పోలీసులు, ప్రభుత్వ ఉన్నతాధికారులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. దాంతో టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జ్ చేసినా కార్మికులు వెనకడుగు వేయలేదు. ఓ వైపు రక్తం కారిపోతున్నా… కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినదించారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కన్నా ఈ మిలియన్ మార్చ్ లో ప్రజాగ్రహం పెల్లుబికింది! కార్మికుని చమట కష్టం ముందు…అవినీతి అధికారుల కంపు తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు నలబై రోజుల తరవాత కూడా అదురూ-బెదురూ లేకుండా ముందుకు సాగిన ఆర్టీసీ కార్మికుని ధైర్యానికి సమాజం సలాం కొడుతోంది!