ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారుల్లో అవగాహన కోసం సైబరాబాద్ పోలీసులు సృజనాత్మకమైన ఆలోచనలు చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా వారు చేసే పోస్టులు.. ఎంతో ఆకట్టుకునేలా, ఆలోచింపజేసేలా ఉంటున్నాయి. కొత్తగా ఏ సినిమా విడుదలైనా సరే ఆ సినిమా పోస్టర్లను ట్రాఫిక్ రూల్స్ వివరించేందుకు తెగవాడేస్తున్నారు. తాజాగా హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా వచ్చిన చావు కబురు చల్లగా మూవీ పోస్టర్‌ను కూడా తమ పబ్లిసిటీ కోసం ఉపయోగించుకున్నారు.
చావు కబురు చల్లగా సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌లో కార్తికేయ, లావణ్య త్రిపాఠి బైక్‌పై వెళ్తుంటారు. అందులో కార్తికేయ హెల్మెట్ పెట్టుకోకుండా హుషారుగా బైక్ నడిపిస్తుంటాడు. దీన్ని ట్రాఫిక్ రూల్స్ కోసం వాడుకున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..ఆ ఫోటోను షేర్ చేస్తూ..’హెల్మెట్ పెట్టుకుని, సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు బస్తీ బాలరాజు గారు’ అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు. ఆ పోస్ట్‌లో కార్తికేయ, లావణ్య త్రిపాఠిని కూడా ట్యాగ్ చేశారు.
ఇప్పుడీ ట్వీట్‌పై నెటిజన్లు మెచ్చుకోలేక ఉండలేకపోతున్నారు. అబ్బాబ్బా సినిమా పోస్టర్లను కూడా ఏం వాడేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇది వేరే లెవెల్ ప్రమోషన్ అంటూ మరికొందరు రిప్లై ఇచ్చారు. మరికొందరేమో మరింత ఫన్నీగా.. పాపం ఆర్ఎక్స్ 100 లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటపడి ఇప్పుడే ఓ పిల్లను తగులుకున్నాడు.. మానవత్వంతో వదిలేయండి అంటూ నెటిజన్లు కూడా ఫన్నీ రిప్లైలు ఇస్తున్నారు.
హెల్మెట్లు పెట్టుకొని, సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు బస్తీ బాలరాజు గారు @ActorKartikeya @Itslavanya @Koushik_psk #ChaavuKaburuChallaga pic.twitter.com/XPDTfV3bm0
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) March 19, 2021