తెలుగు రాష్ట్రాల్లో ఆ ఇద్దరు బీజేపీ లీడర్ల మధ్య విబేదాలు తారాస్థాయికి చేరాయా..? తన రాష్ట్రంలో ఇంకొకరి ఆధిపత్యాన్ని సహించలేక ఒకరు అవకాశం వచ్చినప్పుడల్లా అవతలి నేతపై అసహనం వ్యక్తం చేస్తుంటే.. మరో నేత తన పని తాను చేసుకుపోతున్నారు. ఇద్దరికీ కేంధ్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఎవరూ తగ్గడం లేదు. ఇప్పుడిప్పుడే పార్టీ బలపడుతోందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరి కోల్డ్ వార్ పార్టీని ఎటువైపు తీసుకెళ్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్..
ఇద్దరు తెలుగు వారే.. ఇద్దరికీ కేంధ్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు నెరపే స్థాయి వున్న నేతలు. ఒకరిది తెలంగాణ. మరొకరిది ఆంధ్ర ప్రదేశ్. ఇద్దరికీ ఆర్ఎస్ఎస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇద్దరూ అనేక రాష్ట్రాలకు ఇన్చార్జ్‌లుగా వ్యవహరించిన వారే. దశాబ్ద కాలంగా పార్టీ ఎదుగుదలకు ప్రయత్నించిన వ్యక్తి ఒకరైతే, గత ఐదేళ్ళుగా తన ప్రభాల్యాన్ని అంతకంతకూ పెంచుకుంటున్న వ్యక్తి మరొకరు. ఇద్దరూ కలిసి పనిచేస్తే రాష్ట్రంలో పార్టీని తిరుగులేని శక్తిగా మలచగలిగే సత్తా వున్నవాళ్లే. కానీ, ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్యా కోల్డ్ వార్ ఏదో నడుస్తోంది. వీరిలో ఒకరు కరీంనగర్‌కు చెందిన మురళీధర్‌రావు. మరొకరు రామ్ మాధవ్.
మురళీధర్‌రావు గుజరాత్, రాజస్తాన్, ఉత్తర్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్ వంటి రాష్ట్రాలకు ఇన్చార్జ్‌గా వ్యవహరించారు. ఆయన ఆధ్వర్యంలో బీజేపీ అనేక ఎన్నికలను ఎదుర్కొంది. కానీ, ఆయన ప్రభావం ఆ ఎన్నికల్లో వుందా అంటే అంతగా కనిపించలేదనే చెప్పాలి. గత ఏడాది కాలంగా ఆయన ఇన్చార్జ్‌గా వ్యవహరించిన కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అతి పెద్ద పార్టీగా వ్యవహరించినా ప్రభుత్వం ఏర్పాటుచేయలేక పోయింది. ఎక్కడా ఆయన పేరు వినిపించిన దాఖలాలు లేవు.
ఇక రామ్ మాధవ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ సాధిస్తోన్న అనేక విజయాల వెనక రామ్ మాధవ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈమధ్య జమ్ముూ కశ్మీర్, అస్సాం, త్రిపురలతో పాటు అనేక రాష్ట్రాల్లో రామ్ మాధవ్ ఆధ్వర్యంలో పార్టీ విజయాలు నమోదు చేసింది.
ఈ జయాపజయాలే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరి మధ్యనా ఆగాధాలు ఏర్పడటానికి రీజన్ అని చెప్పుకుంటున్నారు పార్టీనేతలు. ఈ విషయంలో కేంధ్ర నాయకత్వం దృష్టిలో రాం మాధవ్ గ్రాఫ్ పెరగడం.. మురళీధర్‌రావు ప్రాభవం కాస్తా తగ్గడం.. కారణంగా కోల్డ్ వార్ షురూ అయ్యిందని అంటున్నారు.
ఇక తెలంగాణకు చెందిన మురళీధర్‌రావు వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత. ఉత్తర తెలంగాణకు చెందిన ఈయనకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి పార్టీ వర్గాలు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నేతలు ఈయనతో టచ్‌లో ఉన్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ వార్తలను ఆయన మాత్రం కొట్టిపడేస్తున్నారు. తనకు కేసీఆర్‌తో సంబంధాలే లేవని, చాలా సంవత్సరాల క్రితమే తాను సొంత జిల్లా, సొత ఊరు నుంచి బయటకు వచ్చి సంఘ్ కార్యక్రమాలపై దేశంలో వివిద రాష్ట్రాల్లో పనిచేసి వచ్చానని మురళీధరరావు అంటున్నారు. తన బంధువులు, తన సామాజిక వర్గంతో పెద్దగా సంబంధం లేదని, విధ్యాసాగర్‌రావుతో కూడా వ్యక్తిగతంగా ఎప్పుడూ సమావేశం అయిన దాఖలాలు లేవని చెబుతున్నారు. తనకు అధిష్టానం అండ మాత్రమే వుందని, ఎవరు ఎన్నికుట్రలు పన్నినా తనకు వచ్చే నష్టం ఏమీ లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రాంమాధవ్, మురళీధర్‌రావు మధ్య రాజకీయ ఈగోలు ఇటీవల తారాస్థాయికి చేరాయని చెప్పొచ్చు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో రాంమాధవ్ పేరు వినిపించడంతో ఇవి భగ్గుమనే స్థాయికి చేరాయి. మోడీ, అమిత్ షా తరువాత రాంమాధవ్ పేరు పార్టీలో ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎవరు బీజేపీలో చేరాలన్నా రాం మాధవ్‌తోనే టచ్‌లో ఉంటున్నారు. ఢిల్లీ వెళ్ళీ ఆయనతో సమావేశం అయిన తరువాతే పార్టీలో చేరుతున్నారు. మరోవైపు తెలంగాణ నేతలు సైతం రాం మాధవ్ వెంటే వెళ్తున్నారు. ఆయనతో పాటే వెళ్ళీ కేంద్ర నాయకులను కలుస్తున్నారు. తెలంగాణకు చెందినతనని కాదని తెలంగాణ నేతలు కూడా రాంమాధవ్‌ని కలవడం మురళీధర్‌రావుకు మింగుడు పడటం లేదు. మురళీధర్‌రావుతో సంబంధం లేకుండానే పార్టీ నేతలు కేంధ్ర నాయకత్వాన్ని కలవడం… పార్టీలో చేరిపోవడం జరుగుతుండటంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరుగుతోందంటున్నారు పార్టీనేతలు.
ఈ అగాధం రాష్ట్రంలో పార్టీకి చేటు తెస్తుందని.. ఇప్పటికైనా ఇద్దరి మధ్య దూరం తగ్గించే వ్యవహారంపై కేంధ్ర నాయకత్వం దృష్టి సారించకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే అదరణ పెరుగుతున్న పార్టీకి నష్టం జరగడం ఖాయమని అంటున్నాయి బీజేపీ శ్రేణులు.