కేరళ కుట్టి నయనతార సౌతిండియన్ టాప్ హీరోలందరి సరసన వరుస అవకాశాలు దక్కించుకుంటూ, దానికి సమాంతరంగా వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తక్కువకాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకుంది. తన నటన, సక్సెస్‌లతో లేడీ సూపర్ స్టార్‌గా అభిమానులతో పిలవబడుతోంది. మంచినటిగా గొప్ప పేరు సంపాదించుకున్న నయనతార పైన సినీ పరిశ్రమలో తరచూ ఒక కంప్లైంట్ వినిపిస్తూ ఉంటుంది.
ఎంత పెద్ద సినిమా అయినా సరే, ఆ సినిమా ప్రమోషన్స్‌కు మాత్రం నయనతార రాదనేది ఆ కంప్లైంట్. నయనతార లాంటి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ప్రమోషన్ కార్యక్రమాలకు వస్తే తప్పకుండా అది హైప్‌ను పెంచడానికి పనికొస్తుంది. కానీ ఆమె మాత్రం ఇందుకు విరుద్ధం అంటారు. తాను నటించడానికి ఒప్పుకునే ప్రతీ సినిమాలోనూ ముందుగానే తాను ప్రచార కార్యక్రమాలకు రానని ఖరాఖండీగా చెప్పి మరీ తను అగ్రిమెంట్ చేసుకుంటుందట.
అయితే మెగా పవర్ స్టార్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్ పై తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ సినిమా సైరా లో హీరోయిన్ గా నటించేలా నయనతారతో అగ్రిమెంట్ చేయించుకున్నప్పుడు ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని కోరినట్టు సమాచారం. అలాగే అప్పుడు నయనతార కూడా సరే అన్నట్టు చెబుతున్నారు. కానీ ఇటీవలే జరిగిన భారీ ఈవెంట్ సైరా టీజర్ లాంఛ్‌కు ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ అయిన నయనతార రాకపోవడం ఒక లోటుగానే కనిపించింది. అయితే నయనతార తమిళంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ సరసన నటిస్తున్న “దర్బార్” షూటింగ్ బిజీలో ఉంది కాబట్టే రాలేదని చెబుతున్నారు. మరి ఇక ముందైనా జరగబోయే సైరా ప్రచార కార్యక్రమాల్లో నయన్ పాల్గొంటుందా లేదా అని వేచి చూడాలి