వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినం రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై ఉగ్రవాదులు కుట్రపన్నారన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ట్రాక్టర్ ర్యాలీలో విధ్వంసానికి పాకిస్తాన్ ఐఎస్‌ఐ, ఖలిస్తాన్ సంస్థలు పన్నాగం పన్నినట్టు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అరాశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతు సంఘాలకు వారు సూచించారు.
ప్రభుత్వంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో రైతులు పిలుపునిచ్చిన ఈ ట్రాక్టర్ ర్యాలీ దెబ్బతీసేందుకు పాకిస్థాన్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్టు వారు వివరించారు. ఇందుకోసం పాకిస్తాన్ నుంచి ఏకంగా 300 ట్విటర్ ఖాతాలు పనిచేస్తున్నట్టు వారు చెబుతున్నారు. ఇవన్నీ కూడా గడిచిన రెండు నెలల కాలంలోనే ఏర్పాటైనట్టు వారు వెల్లడించారు. రైతుల ర్యాలీలో వేర్పాటువాద నేత జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలే పోస్టర్లను ప్రదర్శిస్తారన్న సమాచారం కూడా ఉందంటున్నారు పోలీసులు. ఉగ్ర కుట్రలపై సమాచారంతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.