మంథనిలో న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో తాజాగా మరొక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు కేసులో A-5గా చేర్చిన ఊదరి లచ్చయ్యను మంథని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. లచ్చయ్యకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం లచ్చయ్యను పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన కుంట శ్రీనివాస్, కుమార్, చిరంజీవి, బిట్టు శ్రీనివాస్ ను ఇప్పటికే అరెస్టు చేసి కస్టడీలోకి కూడా తీసుకోన్నారు. తాజాగా ఐదో నిందితుడు లచ్చయ్యను అరెస్ట్ చేశారు.
మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ఊదరి లచ్చయ్య లాయర్ల హత్యకు కొన్ని గంటల ముందు మంథనిలో కోర్టు వద్ద ఉన్న సమయంలో వారి కదలికలపై రెక్కీ నిర్వహించినట్టుగా గుర్తించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారి వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేశారు. మొత్తం 9 మంది సాక్షుల వాంగ్మూలాలను సేకరించారు. సాక్షుల్లో వామన్‌రావు తండ్రి, హత్య జరిగిన ప్రదేశంలో నిలిచి ఉన్న బస్సులోని డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారని తెలుస్తోంది.
ఇక నిందితులు హత్యకు వాడిన కొడవళ్లను పార్వతి బ్యారేజ్ నుంచి వెలికి తీయించిన పోలీసులు.. నిన్న మరోసారి సీన్‌రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు.