ఆంధ్రలో సంపన్నుడైన దేవుడు ఎవరు అంటే తిరుపతి వెంకన్నే అని చెబుతారు. కానీ సింహాద్రి అప్పన్న కూడా అంతే సంపన్నుడు. కాకపోతే ఆ విషయం చాలా మందికి తెలియదు.సింహాద్రి అప్పన్నకు వేల ఎకరాల భూమి ఉంది. ఆ భూమి కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఒక్క సర్వే నెంబర్ లోనే 5 వేల ఎకరాల భూమి ఉంది. ఆ భూమిపై ఇప్పుడు భూకబ్జాదారుల కన్ను పడింది. దేవస్థాన అధికారులతో కుమ్మక్కైన కొంత మంది రాజకీయ నాయకులు దేవుని భూములను లీజుల పేరిట సొంతం చేసుకుంటున్నారు.
వేల ఎకరాలను వేలం పాట వేస్తున్నారు. దేవస్థానం కోసం నాడు రైతులు, భూస్వాములు ఇచ్చిన భూమి ఇప్పుడు కబ్జాదారుల పాలవుతుంది. పేదవాడు ఇల్లు కట్టుకుంటుంటే దేవస్థానం భూమి అని పెద్ద ఎత్తున వచ్చి అడ్డుకునే అధికారులు, పోలీసులు అదే బడాబాబులు ఆ భూములను ఆక్రమించుకుంటుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రజలు అడుగుతున్నారు. పేదవాడికి ఓ న్యాయం…పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు.