దేశీయ విమాన యాన సంస్థ ఎయిర్ ఏషియా సంస్థకు పౌర విమానయాన ప్రాధికార సంస్థ(డీజీసీఏ) షాక్ ఇచ్చింది. ఎయిర్ ఏషియాపై రూ. 20 లక్షల జరిమానా విధించింది. పౌర విమానయాన సంస్థ నిబంధనల ప్రకారం విమాన పైలట్ కు నిర్వహించే సామర్థ్య పరీక్షల సమయంలో సరైన నిబంధనలు పాటించలేదని డీజీసీఏ గుర్తించింది.
డీజీసీఏ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించడంలో విఫలమైనందుకు ఎయిర్ లైన్స్ ట్రైనింగ్ హెడ్ ను మూడు నెలల పాటు పదవి నుంచి డీజీసీఏ తొలగించింది. మరో ఎనిమిది మంది పరిశీలకులకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున డీజీసీఏ జరిమానా విధించింది.
సంబంధిత మేనేజర్, శిక్షణాధిపతి, పర్యవేక్షకులకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు పంపింది. డీజీసీఏ నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలంటూ నోటీసుల్లో పేర్కొంది. వారు ఇచ్చే వివరణల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది.
ఒక నెల వ్యవధిలో టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్‌పై వరుసగా ఇది మూడో చర్య కావడం గమనార్హం. డీజీసీఏ నోటీసులను సమీక్షిస్తున్నామని ఎయిర్ ఏషియా తెలిపింది. దానిపై అప్పీల్‌కు పరిశీలిస్తున్నామని ప్రకటనలో వెల్లడించింది.