ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్‌కు సంబంధించి డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆయన సోదరి, లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహితుల నివాసాల్లో ఈడీ నిన్న దాడులు నిర్వహించింది. దాడుల సమయంలో వారి నివాసాల్లో రూ. 70లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
దీంతో పాటు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 540 గ్రాముల బంగారం, 900 అమెరికా డాలర్లను సీజ్ చేసినట్టు వెల్లడించాయి. తేజస్వి యాదవ్ ఉంటున్న ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని నివాసంపై నిన్న ఈడీ దాడి చేసిందని, ఈ కేసులో నిందితుడైన ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆ ఇల్లు రిజిస్టర్ అయినట్టు ఈడీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ కేసులో నిందితునిగా ఉన్న కంపెనీ పేరుతో రిజిస్టర్ అయిన నివాసాన్ని తేజస్వి యాదవ్ లేదా లాలూ యాదవ్ కుటుంబం ఉపయోగిస్తున్నట్టు తేలిందన్నారు. ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే అబు దోజానాకు చెందిన మెరిడియన్ కన్‌స్ట్రక్షన్‌కు నాలుగు ల్యాండ్ పార్సిళ్లను విక్రయించినట్లు ఈడీ విచారణలో తేలిందని అధికారి తెలిపారు.
ఈ కుంభకోణానికి సంబంధించి దేశ రాజధాని ఢిల్లీతో పాటు పాట్నా, రాంచీ, ముంబై ఇతర ప్రాంతాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించింది. ఢిల్లీలోని తేజస్వీ యాదవ్ నివాసంతో పాటు మొత్తం 24 ప్రాంతాల్లో నిన్న ఈడీ దాడులు చేసింది.