అరుణాచల్ ప్రదేశ్ లో ఇండో చైనా సరిహద్దుకు సమీపంలో 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. కురుంగ్ కుమే జిల్లాలో దామింగ్ సెక్టార్ వద్ద వీరంతా బోర్డర్ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో వారం క్రితం కనిపించకుండా పోయారు.
మొత్తం 19 మంది గల్లంతు అయ్యారని డిప్యూటీ కమిషనర్ ధ్రువీకరించారు. వారిలో ఒకరి మృతదేహాన్ని దగ్గరిలోని ఓ నదిలో గుర్తించినట్టు ఆయన వెల్లడించారు. అయితే దామింగ్ లోని కుమే నదిలో వీరంతా మునిగిపోయారని స్థానికులు అంటున్నారు.
చైనాకు సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద కార్మికులు అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈద్ పండుగ కావడంతో తమకు సెలవు కావాలని కాంట్రాక్టర్ ను కార్మికులంతా కోరినట్టు తెలుస్తోంది. కానీ దానికి కాంట్రాక్టర్ నిరాకరించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో వారంతా అక్కడి నుంచి కాలినడకన పారిపోయారని, ఈ క్రమంలో కారడవిలో వారు చిక్కుకుని ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.