జీవితంలో అత్యంత ప్రాధాన్యమైన అంశం ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే. దాని కన్నా మించింది మరేం ఉంటుంది చెప్పండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడమంటే మన జీవిత కాలాన్ని పొడిగించుకోవడమే కదా. అందుకే ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి తీరాల్సిందే. లేదంటే.. ఏ రోగం ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియదు… పైగా కనిపించేందుకు ఆరోగ్యంగా ఉంటున్నామని చాలామంది సంబురపడిపోతున్నా..అనారోగ్యం బారిన పడేందుకు కొంత టైంలోనే జీవితాన్ని చిన్నాభిన్నం చేసే రోగాలు ప్రపంచ దేశాల ప్రజలను ఇప్పుడు వణికిస్తోన్నాయి. అందులో టాప్ ప్లేసులో కేన్సర్ ముందుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించిన తాజా నివేదిక ఇప్పుడు అందర్నీ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ విషయమేంటంటే..
ఒక్కో కణాన్ని పాడు చేస్తూ శరీర వ్యవస్థనే చిన్నాభిన్నం చేస్తోన్న అతి ప్రమాదకారి కేన్సర్. గొంతు, రొమ్ము, ప్రొస్టేట్, కాలేయం.. ఇలా శరీరంలోని అన్ని కీలక భాగాలను లక్ష్యంగా చేసుకొని ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తోంది. అయితే ఇదివరకు కేన్సర్ భూతం మన దాకా వస్తుందా… మనకు అస్సలు రాదులే అనే వాళ్ళు కూడా భయపడిపోయేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెలుగులోకి తీసుకొచ్చిన నివేదిక ఉంది. ఈ కేన్సర్ ఇండియాకు చాపకింద నీరులా విస్తరిస్తోందని సంచలన నిజాలను బయటపెటింది.
ఈ మహమ్మారి ప్రతి పదిమంది ఇండియన్స్ లో ఒకరికి కేన్సర్ వచ్చేంత ప్రమాదకరంగా మారుతోందని చెప్పింది. దేశ ప్రజలంతా నోరెళ్లబెట్టాలా.. కేవలం 2018లోనే భారత్‌లో 1.16 మిలియన్ కేన్సర్ కేసులు నమోదయ్యాయి. దీని ప్రకారం ప్రతి 15 మందిలో ఒకరు మృత్యువాతపడతారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ సంచలన నిజాలను బయటపెట్టింది. ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా గర్భాశయ, రొమ్ము, పొట్ట క్యాన్సర్లే అధికంగా వస్తున్నట్లు తేల్చిచెప్పింది. మొత్తంగా నమోదు అవుతోన్న కేన్సర్లో 45శాతం ఇవే కేసులు నమోదు అవుతున్నట్లు వెల్లడించింది.