అక్రిడియేషన్ లేని మహిళా జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. మహిళా దినోత్సవం రోజున ప్రామిస్ చేసినట్టుగానే ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి సిద్ధమైంది. అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులకు I&PR ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి 10 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ తెలిపారు.
ఈ మాస్టర్ హెల్త్ చెకప్ లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అక్రిడియేషన్ మహిళా జర్నలిస్టులతో పాటు పత్రికా, న్యూస్ ఛానెళ్లలో పని చేస్తూ ఆర్గనైజేషన్ గుర్తింపు కార్డులు ఉన్న మహిళా జర్నలిస్టులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అరవింద్ కుమార్ వెల్లడించారు. ఈ మెడికల్ క్యాంపుని ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహిస్తారని చెప్పారు.
ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్ లో రక్త పరీక్ష, బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్రపరీక్షలు, విటమిన్ బి12, డి3, పలురకాల డయాగ్నోస్టిక్స్ పరీక్షలు , ECG, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మియర్, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, కంటి స్క్రీనింగ్ , దంతపరీక్షలు, గైనకాలజీ టెస్టులు చేస్తారు. ఈ పరీక్షల రిపోర్టులు అదే రోజు అందిస్తారన్నారు అరవింద్ కుమార్.
రాష్ట్ర వ్యాప్తంగా మహిళా జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మార్చి 21వ తేదీన సీఎస్ శాంతికుమారి ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాల అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మహిళా జర్నలిస్టులకు దాదాపు 56 రకాల పారామీటర్లు, 12 పరీక్షలు మాస్టర్ హెల్త్ చెకప్ ద్వారా నిర్వహించాలని సూచించారు. ఇందుకు గాను I&PR కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కమీషనర్ ను కోరారు.