భారతీయుల వంటకాల్లో మసాలా దినుసులు ప్రత్యేక పాత్రను పోషిస్తాయి. అనేక రకాల వంటల్లో నిత్యం మనం మసాలా దినుసులను వాడుతుంటాం. అయితే అవి నిజానికి మనకు రుచిని, సువాసనను అందివ్వడమే కాదు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఈ క్రమంలోనే మసాలా దినుసుల వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు
పసుపులో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్‌తో పోరాడుతాయి. క్యాన్సర్లు రాకుండా చూస్తాయి. గాయాలు త్వరగా మానుతాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
జీలకర్ర
జీలకర్రలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఆర్థరైటిస్, జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధులపై పోరాడుతాయి. ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతాయి.
నల్ల మిరియాలు
ఇవి సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పనిచేస్తాయి. జలుబు, ఫ్లూ వంటి సమస్యలను తగ్గిస్తాయి. జీర్ణాశయంలో ఉండే సూక్ష్మక్రిములు నశిస్తాయి. చెవుల్లో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇవి యాంటీ డిప్రెస్సెంట్‌గా కూడా పనిచేస్తాయి. హైబీపీని తగ్గిస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇంగువ
ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది.
అల్లం
ఇది జలుబు, ఫ్లూ, జీర్ణ సమస్యలు, డయేరియా, అజీర్ణం, గొంతు సమస్యలు, లివర్, కిడ్నీ సమస్యలను నయం చేస్తుంది. స్ప్లీన్, కిడ్నీ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
యాలకులు
వీటిల్లో 40 శాతం ఫ్లేవనాయిడ్స్, 30 శాతం టెర్పెనాయిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
లవంగాలు
ఒళ్లు నొప్పులు, కడుపు నొప్పి, గొంతు సమస్యలు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలను తగ్గించుకునేందుకు లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, హైబీపీ, చర్మ సమస్యలు, మూత్రాశయ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు రాకుండా ఉంటాయి.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్కను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీన్ని వాడడం వల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీరంలో సెరొటోనిన్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. దీంతో డిప్రెషన్ తగ్గుతుంది.
కుంకుమ పువ్వు
దీన్ని వాడడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీరంలో అంతర్గతంగా ఏమైనా గాయాలు అయితే తగ్గుతాయి.
ఆవాలు
ఇవి మన శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములను చంపుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, ఫ్లూ, జీర్ణాశయ సమస్యలు తగ్గుతాయి.