కాంబోడియా లోని ఓ హోటల్ కేసినోలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు. 30 మందికి పైగా గాయపడ్డారు. బుధవారం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ‘పోయ్ పేట్’ లోని హోటల్ కేసినోలో మంటలు చెలరేగాయి. దగ్ధమవుతున్న హోటల్ లో కొందరు బయటకు రాలేక చిక్కుకు పోగా.. మరికొందరు తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కిటికీల నుంచి దూకుతున్న దృశ్యాల తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
థాయిలాండ్-కాంబోడియా బోర్డర్ పొడవునా ఉన్న పలు కేసినో హోటళ్లలో ఇదొకటి. ఈ ప్రమాదంలో మొదట మంటలు హోటల్ మొదటి అంతస్థులో చెలరేగాయని, క్రమంగా ఇతర ఫ్లోర్లకు వ్యాపించాయని ఓ ఎన్జీఓ సంస్థ తెలిపింది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో కొందరు విదేశీయులతో సహా సుమారు 400 మంది ఇక్కడ ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
మృతుల్లో ఎక్కువమంది కాంబోడియన్లు కాగా-కొందరు థాయిలాండ్ వాసులు కూడా ఉన్నారు. గ్రాండ్ డైమండ్ సిటీ పేరిట గల ఈ హోటల్లో రోజూ కేసినో నిర్వహిస్తుంటారు. థాయ్ నుంచి కూడా వచ్చిన అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పడానికి తీవ్రంగా యత్నించాయి.
గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించినట్టు కాంబోడియా విదేశాంగ శాఖ తెలిపింది. భవనంలో చిక్కుబడినవారిని రక్షించేందుకు సహాయక బృందాలు కొన్ని గంటలపాటు శ్రమించాయి. ఈ మంటలకు కారణం తెలియలేదు.