గన్ కాల్పులతో అమెరికా మళ్ళీ ఉలిక్కిపడింది. కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్ లో చైనీస్ ల్యూనార్ న్యూ ఇయర్ వేడుకల్లో రక్తం చిందింది. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 10 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ దుండగుడిని ఇంకా గుర్తించలేదు. లాస్ ఏంజిలిస్ కి కౌంటీ అయిన ఈ మాంటెరీ పార్క్ వద్ద జరుగుతున్న వేడుకలకు వేలమంది హాజరయ్యారు. .
దుండగుడు భారీ మెషిన్ గన్ తో అక్కడికి చేరుకొని కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన ప్రాంతం వద్దే సియాంగ్ వాన్ చాయ్ అనే వ్యక్తి ఓ రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నాడని, రాత్రి ముగ్గురు వ్యక్తులు ప్రాణ భయంతో ఈ రెస్టారెంట్ కి వచ్చి తలుపులు వేసేశారని తెలిసింది. బయట ఓ వ్యక్తి కాల్పులు జరుపుతున్నాడని వారు చెప్పినట్టు సియాంగ్ తెలిపాడు. దుండగుడి వద్ద పెద్దఎత్తున మందుగుండు సామాగ్రి, ఆయుధాలు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
కాల్పుల సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఓ డ్యాన్స్ క్లబ్ వద్ద ఈ ఘటన జరిగినట్టు మరికొందరు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి పరారైనట్టు తెలుస్తోంది. సుమారు 60 వేల మంది జనాభాతో కూడిన మాంటెరీ పార్క్ లో చాలామంది చైనీయులే. ఈ ఘటనలో గాయపడినవారిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాల తాలూకు వీడియోలను కొందరు రిలీజ్ చేశారు.
దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు ఆ ప్రాంతాన్నంతా దిగ్బంధం చేసినట్టు అసోసియేటెడ్ ఫ్రెంచ్ ప్రెస్ వెల్లడించింది. దక్షిణ కాలిఫోర్నియాలో రెండు రోజులపాటు చైనీస్ న్యూ ఇయర్ ల్యూనార్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహిస్తారు. దీన్ని పురస్కరించుకుని వేలమంది విజిటర్లు, చైనీయులు అక్కడికి చేరుకుంటారు. ఇది తెలిసే ఆ వ్యక్తి మారణకాండకు పాల్పడినట్టు తెలుస్తోంది.