బాక్సాఫీస్ బరిలో సినిమా విడుదల జాతర కొనసాగుతోంది. సెప్టెంబర్ నుంచి వరుసపెట్టి సినిమాలు వస్తున్నాయి. వారానికి మినిమం అరడజను సినిమాలకు తగ్గకుండా థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ ఏడాదికి చివరి వారాంతం అయిన 30వ తేదీన కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది.
ఈ వీకెండ్ ఏకంగా 10 సినిమాలు థియేర్లలోకి వస్తున్నాయి. వీటిలో అంచనాలు పెంచుతున్న సినిమాలు తక్కువే అయినప్పటికీ, అందర్నీ ఆకర్షించిన సినిమా మాత్రం ఖుషీ. పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాను ఇయర్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చేలా రీ-రిలీజ్ చేస్తున్నారు. దీనిపై చాలా బజ్ నడుస్తోంది. ఓ కొత్త సినిమాను ప్రమోట్ చేసినట్టు, ఖుషీని ప్రమోట్ చేస్తున్నారు.
ఇక ఖుషితో పాటు.. టాప్ గేర్, లక్కీ లక్ష్మణ్, ఎస్-5 సినిమాలు కూడా వస్తున్నాయి. టాప్ గేర్ అయినా సక్సెస్ అయితే ఈ ఏడాదిని ఓ విజయంతో ముగించాలని చూస్తున్నాడు ఆది సాయికుమార్. ఇక లక్కీ లక్ష్మణ్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని తహతహలాడుతున్నాడు సోహెల్. అటు తారకరత్న నటించిన ఎస్5 సినిమా ట్రయిలర్ తో ఎట్రాక్ట్ చేస్తోంది.
ఈ మూవీలతో పాటు రాజయోగం, కొరమీను, నువ్వే నా ప్రాణం, ఛేజింగ్, డ్రైవర్ జమున, ఉత్తమ విలన్ కేరాఫ్ మహదేవపురం అనే సినిమాలు కూడా ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి.
ఆల్రెడీ క్రిస్మస్ కానుకగా వచ్చిన 18-పేజెస్, ధమాకా సినిమాలు థియేటర్లలో ఉన్నాయి. వీటిని ఈ 10 సినిమాల్లో ఏ సినిమా అడ్డుకుంటుందో చూడాలి.