జైల్లో జైన్ కి కొనసాగుతున్న రాచభోగాలు.. పదిమంది సేవకులు !
ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ కి తీహార్ జైల్లో ఇంకా రాచభోగాలు కొనసాగుతున్నాయి. ఆయనకు సేవలు చేసేందుకు సుమారు 10 మంది సదా ‘విధుల్లో’ ఉంటున్నారని జైలు వర్గాలు తెలిపాయి. వీరిలో కొందరు ఆయన సెల్ శుభ్రం చేయడం, బెడ్ సరి చేయడం, బయటి నుంచి ఫుడ్, మినరల్ వాటర్, పండ్లు, బట్టలు తేవడం వంటిపనుల్లో బిజీగా ఉంటున్నారట.
ఇద్దరయితే ఆయనకు ‘సూపర్ వైజర్లుగా వ్యవహర్తిస్తున్నారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. జైల్లో తనకు జైనుల సాత్వికాహారం ఇవ్వడం లేదని పేర్కొంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ని రౌజ్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. నేను ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు అవసరమైన ఆహారాన్ని జైలు సిబ్బంది ఇవ్వడం లేదు.. ఆలయాలకు వెళ్లే సౌకర్యం కూడా నాకు లేదు. కొన్ని రోజులుగా నేను సలాడ్, పండ్లు తిని బతుకుతున్నాను అని జైన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
అయితే వీటిని కోర్టు తేలిగ్గా పరిగణించింది. జైల్లో మీకు పండ్లు, డ్రై ఫ్రూట్లు ఎలా వస్తాయని స్పెషల్ జడ్జ్ వికాస్ ధల్ అన్నారు. ఇక హౌస్ కీపింగ్ సిబ్బంది కూడా జైన్ సేవలో ఉన్నారు.
ఇదేగాక.. తన సహచరులతో జైన్ చర్చలు, మాటా మంతీ జరుపుతూ బిజీగా ఉంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు బీజేపీ నేతలు వీటిని బయటపెడుతూ జైన్ వైఖరిని దుయ్యబడుతున్నారు. ఆ మధ్య ఓ రేపిస్టుతో మసాజ్ చేయించుకున్న ఈయన వైనం సంచలనం రేపింది.