దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు జరిగి ఈ రోజుతో పదేండ్లు అవుతోంది. కానీ ఇప్పటికీ ఆ రోజు గుర్తుకు వస్తే అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడుతారు. చూస్తుండగానే రెప్ప పాటులో పేలుళ్ల ధాటికి పందొమ్మది మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.
జంట బాంబు పేలుళ్లకు పదేండ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పేలుళ్లలో మరణించిన వారికి స్థానికులు నివాళులర్పించారు. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కోణార్క్ థియేటర్ ప్రాంతంలో ప్రజలు రద్దీగా ఉన్నారు. ఎవరి పనుల్లో వారు మునిగిపోయి వున్నారు.
ఇంతలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. కండ్లు మూసి తెరిచేలోపే ఆ ప్రాంత మంతా తెగిపడిన కాళ్లు, చేతులతో రక్త మడుగులా మారింది. కొద్ది క్షణాల వ్యవధిలోనే రెండు చోట్ల బాంబులు పేలాయి. ఈ ఘటనలో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
సుమారు 120మందికి గాయాలయ్యాయి. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడింది. ఈ కేసులో విచారణ అనంతరం నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు అప్పట్లో మరణ శిక్ష విధించింది. కానీ ఇప్పటి వరకు ఆ శిక్ష అమలు కాకపోవడం గమనార్హం.