చిరంజీవికి హైకోర్టు నోటీసులు
జూబ్లీ హిల్స్ సొసైటీ అక్రమ రిజిస్ట్రేషన్ పై స్టే
కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దన్న ఉన్నత న్యాయస్థానం
అక్రమాలపై పెద్దలు గద్దలే అంటే
పరువు నష్టం అంటూ 100 కోట్ల బ్లాక్ మెయిల్
అడుగడుగునా అవే తప్పులు
కోర్టులో మొట్టికాయలు
క్రైమ్ బ్యూరో తొలివెలుగు
ప్రజల అవసరాల కోసం ఉపయోగపడే భూమిని అక్రమంగా సినీ నటుడు చిరంజీవికి కట్టబెట్టింది జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ.. గజం 4 లక్షలు పలికే 595 గజాల భూమిని క్విడ్ ప్రో కి ఆస్కారం ఇచ్ఛేలా రిజిస్ట్రేషన్ ధరకే తక్కువకు అప్పగించారు. ఈ వ్యవహారంపై ఇటీవల పూసగుచ్చినట్టు తొలి వెలుగు క్రైమ్ బ్యూరో కథనాలు ఇచ్చింది. అందుకు పరువు నష్టం అంటూ నోటీసులు ఇచ్చారు. అస్మదీయ వార్తా సంస్థల్లో వచ్చే వార్తలకు లేని పరువులు, నష్టాలు .. 5 వేలమంది సొసైటీ సభ్యులు, వారిలో కొందరి భూకబ్జాలపై వార్తలిస్తే దాన్ని జీర్ణించుకోలేని వారు ‘పెద్దల గద్దల’ రూపంలో చెలామణి అవుతున్నారు. ఇప్పుడు ఇదే భూమిపై తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ కావడంతో ఏం సమాధానం చెబుతారన్నది ఆసక్తిగా మారింది. కౌంటర్ దాఖలు చేయాలని అటు చిరంజీవికి, ఇటు సొసైటీ అధ్యక్షుడిని కోర్టు ఆదేశించింది. దీనిపై విచారణను ఏప్రిల్ 25 కి వాయిదా వేసింది.
అక్రమార్జన కోసమే….
గత పాలకమండలి సభ్యులు జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో వందల కోట్లను సంపాదిస్తే.. తాము మాత్రం మౌనంగా ఎందుకు ఉండాలని కొత్త పాలకమండలి అధ్యక్షులు బి.రవీంద్ర నాథ్ భావిస్తున్నట్టు కనబడుతోంది. .. తండ్రి బీఆర్ నాయుడు కనుసన్నుల్లోనే ఆయన కొనసాగుతున్నారని సభ్యులే ఆరోపిస్తున్నారు. లిటిగేషన్ ఉంటే చాలు.. అక్కడ వాలిపోయి దందాలు సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్నీ ‘సజావుగా’ సెట్ రైట్ అయిపోతే ఎలాంటి కబ్జాలు కనిపించవు. కానీ ఎవరో ఒకరు వేలెత్తి చూపితేనే సమస్య !
కొన్ని రోజుల క్రితం బీఎస్ ఎన్ ఎల్ కి చెందిన భూమికి, సొసైటీ ఓపెన్ ప్లేస్ లోని భూమికి సంబంధించి వివాదం తలెత్తింది. ఓ సభ్యుడు ఆ భూమిని కబ్జా చేసినప్పటికీ ఆ తరువాత యవ్వారం చల్లబడి అంతా చేతులు దులుపుకున్నారు. ఇదే సమయంలో స్థలాన్ని కొద్దికొద్దిగా ఆక్రమించుకుంటూ వస్తున్నారు. ఇక అపోలో ఆసుపత్రికి చెందిన భూమిపై కూడా కొందరి కన్ను పడింది. ఇది తమ సొసైటీకే చెందినదంటూ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు దిగారన్న ఆరోపణలున్నాయి. మా మాట వినకపోతే చట్టబద్ధమైన బిల్డింగ్ లకు సైతం చట్ట విరుద్ధమైనవిగా ముద్ర వేస్తారట !
పిచ్చి పీక్ స్టేజికి చేరుకుందా ?
జూబ్లీ హిల్స్ సొసైటీ వ్యవహారం చూస్తే ‘పిచ్చి పీక్ కి ‘ చేరుకున్నట్టే కనిపిస్తోంది. . ఈ సొసైటీకి సంబంధించి 51 వ దర్యాప్తు కొనసాగుతుండగానే 5 గురు సభ్యులను తొలగించారు. వీరిలో సొసైటీ కార్యదర్శి కూడా ఉన్నారంటే కొందరి ప్రతీకారం ఎలా, ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అయితే ఈ 5 గురు సభ్యులూ ట్రిబ్యునల్ కెక్కడంతో ..ట్రిబ్యునల్ వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దాంతో వారు మళ్ళీ తమ సభ్యత్వాన్ని పొందగలిగారు. కార్యదర్శి కూడా తిరిగి తన పదవిని సంపాదించినా ఆయనను పాలక మండలి సమావేశానికి అనుమతించడం లేదు. రాజ్యాంగంలో మాదో ప్రత్యేక వ్యవస్థ అన్నట్టుగా పరిస్థితి మారింది. ప్రతి సమస్యనూ కోర్టులోనే తేల్చుకోవాల్సివస్తోంది. ఏమైనా బడాబాబుల ఈ సొసైటీ ఏదో ఒక వివాదాన్ని నెత్తికెత్తుకుంటూ వీధిన పడుతోంది.