– రష్యా, ఉక్రెయిన్ యుద్దానికి 100 రోజులు
– రష్యా ఆధీనంలో కీలక నగరాలను
– భారీగా సైనికులను నష్ట పోయిన రష్యా
– అల్లాడుతున్న ఉక్రెయిన్ ప్రజలు
– ప్రాణాలు అరచేత పట్టుకొని వలస
– పేకమేడల్లా కూలిన భవనాలు
– యుద్ధం ఆపేది లేదు: పుతిన్
– విజయం మాదే: జెలెన్‌స్కీ
– విజేతల్లేని యుద్ధమిది: ఐరాస
– మీ యుద్ధం మా చావుకొచ్చింది: ఆఫ్రికా దేశాలు
యుద్ధం ఎక్కడైన బలయ్యేది ప్రజలే.. దాడులు ఎవరివైన దహనమయ్యేది ప్రజలే.. సంక్షోభం ఏదైనా చస్తూ బతికేది ప్రజలే.. తినేందుకు తిండి లేక.. ఉండేందుకు చోటు లేక.. కంటినిండా కునుకు లేక.. కంటిపాపకు రక్షణలేక.. చస్తూ బతుకుతున్నారు ఉక్రెయిన్ ప్రజలు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న విధ్వంసంలో ఎంతో మంది ప్రజల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. నాటో కూటమిలో చేరొద్దంటూ దండయాత్ర మొదలు పెట్టిన రష్యా.. ఉక్రెయిన్ ను రెండు, మూడు రోజుల్లో దారికి తెచ్చుకోవచ్చనుకుంది. కానీ.. రష్యాకు భంగపాటు ఎదురైంది. అలా మొదలైన యుద్ధం వంద రోజులకు చేరింది.

కానీ.. రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ చేస్తున్న పోరులో రష్యా కూడా భారీగానే నష్ట పోయింది. తన సైనికులు ఎంతమంది మరణించారన్నదానిపై చివరిసారిగా మార్చి 25న స్పందించిన రష్యా.. 1,351 మంది చనిపోయారని, 3,825 మంది గాయపడ్డారని తెలిపింది. ఆ తర్వాత ఇంత వరకు పెదవి విప్పలేదు. అయితే.. 30వేల మందికి పైగా రష్యా సైనికులు మరణించగా.. 40వేల మంది గాయపడి ఉంటారని ఉక్రెయిన్, పశ్చిమ దేశాల పరిశీలకులు చెప్తున్నారు.
అయితే.. ఇది 10 ఏళ్ల పాటు అఫ్గానిస్థాన్ లో జరిపిన యుద్ధంలో సోవియట్ యూనియన్ కోల్పోయిన మిలటరీ సిబ్బంది సంఖ్య కన్నా అధికమే అంటున్నారు. అంతేకాకుండా.. తూర్పు ఉక్రెయిన్ లోని దొనెట్స్క్ ప్రాంతంలో రష్యా మద్దతున్న వేర్పాటువాదులు 1300 మంది చనిపోగా.. 7,500 మంది గాయపడ్డారని లెక్కలు చూపిస్తున్నారు. లుహాన్స్క్ ప్రాంతంలో 477 మంది వేర్పాటువాదులు, 29 మంది పౌరులు చనిపోయారని అంటున్నారు.
ఈ విధ్వంసాన్ని తట్టుకోలేక ప్రాణాలు అరచేత పట్టుకొని వలస పోతున్నారు అక్కడి ప్రజలు. యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 68 లక్షల మంది ఉక్రెయిన్ ను వీడి ఇతర దేశాలకు వలస వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ అంచనా వేసింది. 71 లక్షల మంది స్వస్థలాలు వీడి.. దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు అంచనాకు వచ్చింది. నిలువ నీడ లేక.. తినడానికి తిండి.. ఉండటానికి గూడు లేక వలసల బాట పట్టారని అంటున్నారు.
రష్యా సాగిస్తున్న మారణకాండలో ఉక్రెయిన్ లోని భవనాలు పేక మేడల్లా కూలుతున్నాయి. శతఘ్నులు, వైమానిక దాడులతో రష్యా సేనలు జరిపిన బాంబు దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు, పట్టణాల్లో సింహభాగం కాంక్రీటు శకలాల దిబ్బల్లా మారిపోయాయి. దాదాపు 38వేల నివాస భవనాలు నేలమట్టమైనట్లు ఉక్రెయిన్ పార్లమెంటరీ కమిషన్ వెల్లడించింది. దీనివల్ల 2.20లక్షల మందికి పైగా నిరాశ్రయులయినట్టు పేర్కొంది. 1900 విద్యా సంస్థలు ధ్వంసం కాగా.. వీటిలో ప్రాథమిక పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకూ ఉన్నట్టు పేర్కొంది. 50 రైలు వంతెనలు, 500 కర్మాగారాలు, 500 ఆసుపత్రులు నాశనమయినట్టు వెల్లడించింది. ఉక్రెయిన్ లోని ఆసుపత్రులు, అంబులెన్సులు, వైద్య సిబ్బందిపై 296 దాడులు జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఇంత జరిగినా.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం యుద్ధం ఆపేది లేదంటున్నారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ నెరవేరిన తర్వాతే పోరు ఆగుతుందని స్పష్టం చేశారు. “డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల ప్రజలను రక్షించడం తమ ప్రధాన లక్ష్యమన్నారు పుతిన్. నాజీ అనుకూల ఉక్రెయిన్ దళాల నుంచి చాలా ప్రాంతాలను విముక్తి చేశామన్నారు. ఏ లక్ష్యాలతో సైనిక చర్య ప్రారంభించామో.. అవి సాధించేవరకు పోరు కొనసాగుతూనే ఉంటోద్దని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తేల్చి చెప్పారు.
ఇంతటి విధ్వంసం జరుగుతున్నప్పటికీ.. ఉక్రెయిన్ సైన్యం మాత్రం అలుపెరగని పోరాటాన్ని సాగిస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. అంతిమంగా విజయం తమదేనంటున్నారు. “మా సైనిక దళాలు ఇక్కడే ఉన్నాయి. ప్రజలూ ఇక్కడే ఉన్నారు. వంద రోజులుగా మేం ఉక్రెయిన్‌ను రక్షించుకుంటున్నాం. అంతిమంగా విజయం మాదే” అని పేర్కొన్నారు. మరోవైపు రష్యాపై వరుస ఆంక్షలు విధిస్తున్న ఈయూ.. శుక్రవారం కొరడా ఝుళిపించింది.
ఉక్రెయిన్, రష్యా పోరు వందో రోజుకు చేరుకున్న సందర్భంలో ఐక్యరాజ్య సమితి మరోసారి స్పందించింది. యుద్ధాన్ని తక్షణమే ఆపేయాలని పిలుపునిచ్చింది. “ఎక్కడ చూసినా విధ్వంసమే. గ్రామాలు, పట్టణాలు నాశనమయ్యాయి. ఈ యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరు. విజేతలు లేని యుద్ధం ఇది. తక్షణమే ఈ పోరును ఆపాలి” అని ఒక ప్రకటన విడుదల చేసింది ఐక్యరాజ్య సమితి.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు.. ఉక్రెయిన్, రష్యా మధ్య పోరు ఆఫ్రికాకు ఆహార సంక్షోభం తెచ్చింది. ఇంధన, ఎరువుల కొరతను కూడా ఆ దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆఫ్రికా యూనియన్(ఏయూ) నేతలు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కలిశారు. తమ బాధలు చెప్పుకున్నారు. “మీ యుద్ధానికి మేం దూరంగానే ఉన్నాం. అయినా ఆర్థికంగా బాధితులమయ్యాం” అని పుతిన్ కు సెనెగల్ అధ్యక్షుడు.. ఏయూ ఛైర్మన్ మేకీ సాల్ విన్నవించుకున్నారు.