సినిమా హాళ్ల యాజమాన్యాలకు కేంద్రం ఊరట కల్పించింది. ఫిబ్రవరి 1 నుంచి 100 శాతం సీట్లతో థియేటర్లు నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తున్నట్లు మార్గదర్శకాల్లో వెల్లడించింది. కరోనా నియంత్రణలో భాగంగా మార్చి నుంచి అక్టోబర్ వరకూ థియేటర్లను మూసి ఉండాలని కేంద్రం ఆదేశించింది. ఆ తర్వాత అక్టోబర్‌లోనే సినిమా హాళ్లు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ.. కేవలం 50 శాతం కెపాసిటీతోనే మాత్రమే నడుపుకోవాలని సూచించింది.
కాగా, 50 శాతం సీట్లతో నష్టాలు వస్తున్నాయని కేంద్రానికి యాజమాన్యాలు విజ్ఞప్తులు చేశాయి. దీంతో 100 శాతం సీట్లతో థియేటర్లు నడిపించేందుకు ఓకే చెప్పింది. అయితే కచ్చితంగా కరోనా మార్గదర్శకాలను పాటించాలని కేంద్రం ఆదేశించింది. అలాగే షో టైమింగ్స్, బుకింగ్స్‌లో తగిన మార్పులు చేయాలని తెలిపింది.