విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సై తో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ పురోహితుడు. వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా ఎస్సై శుక్రవారం ఉదయం హన్మకొండలోని వేయి స్థంభాల దేవాలయ ప్రాంగణంలో ఉదయం నుంచి విధులు నిర్వర్తిస్తుంది.. భక్తులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా విధుల్లో నిమగ్నమైన ఎస్సై కొంత సమయానికి దేవుడి దర్మనం చేసుకుని ప్రసాదం తింటున్నది. ఈక్రమంలో దేవాలయంలో పూజాకార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చిన సందీప్ శర్మ అనే పురోహితుడు మహిళా ఎస్సై వద్దకు వెళ్లి తనకు అవసరం లేకున్నా కలుగజేసుకుని మహిళా ఎస్సైని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించినట్టు మహిళా ఎస్సై ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. యూనీఫాంలో ఉన్న ఎస్‌ఐ విధులకు ఆటంకం కలిగించి అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా దేవాలయంలో విధులు నిర్వర్తించేందుకు వచ్చావా, లేక తినడానికి వచ్చావా అంటూ దుర్భాషలాడినట్టు పేర్కొంది. తీవ్ర మనోవేదనకు గురైన మహిళా ఎస్సై సందీప్ శర్మ తీరుపై కన్నీరు పెడుతూ భక్తుల మధ్యలో నుంచి గుడి బయటకు వచ్చి అక్కడ విధుల్లో ఉన్న ఉన్నతాధికారులకు జరిగిన విషయం తెలుపడంతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని వారు ఆదేశించారు. మహిళా ఎస్సై నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా పురోహితుడు సందీప్ శర్మ పై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు చెప్పుతున్నారు.