రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం జరిగింది. ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన సైనిక చర్యలకు ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వారాల తరబడి పోరాడిన ఉక్రెయిన్ సైనికుల్లో దాదాపు వెయ్యి మంది తమకు లొంగిపోయారని రష్యా ప్రకటించింది. మరియుపొల్ నగరంలోని అజోవ్‌స్తల్ ఉక్కు కర్మాగార ఆవరణను పుతిన్ సేనలు మంగళవారం స్వాధీనం చేసుకొని.. అక్కడి నుంచి ఉక్రెయిన్ సైనికుల్ని తమ నియంత్రణలోని భూభాగంలోకి తరలించినట్టు ప్రకటించింది.
అయితే.. ఇది తరలింపా, లొంగుబాటా అనే అనుమానాలున్న నేపథ్యంలో రష్యా రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనషెన్‌కోవ్ బుధవారం స్పష్టతనిచ్చారు. కర్మాగార ప్రాంగణాన్ని వీడి 959 మంది బయటకు వచ్చారని తేల్చి చెప్పారు. ఖైదీల మార్పిడి కింద వీరిని తిరిగి వెనక్కి తీసుకువస్తామని ఉక్రెయిన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పౌరులపై నేరాలకు పాల్పడిన వారిని గుర్తించడానికి ఉక్రెయిన్ సైనికుల్ని విచారిస్తామని రష్యా దర్యాప్తు సంస్థ తెలిపింది.
మరియుపొల్ కు చెందిన దాదాపు మూడువేల మంది పౌరుల్ని ఒలెనివ్కా సమీపంలోని ప్రాంతానికి రష్యా సైన్యం తరలించిందని ఉక్రెయిన్ మానవ హక్కుల అంబుడ్స్‌మన్ వెల్లడించారు. కాగా.. రష్యా తమపైనా దురాక్రమణకు దిగవచ్చనే ఉద్దేశంతో నాటోలో చేరాలని నిర్ణయించుకున్న ఫిన్లాండ్, స్వీడన్ బుధవారం దానికి సంబంధించిన దరఖాస్తులను బ్రసెల్స్ లోని కూటమి ప్రధాన కార్యాలయానికి పంపించాయి. నాటో సభ్యదేశాల్లో ఒకటైన టర్కీ- వీటి చేరికపై అభ్యంతరం చెప్తున్నప్పటికీ.. ఈ రెండు దేశాలు అధికారిక ప్రక్రియతో ముందుకు సాగుతున్నాయి. కొత్త దేశం నాటోలో చేరాలంటే అందులోని 30 సభ్య దేశాల ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలో అమెరికా సహా నాటోలోని చాలా దేశాలు ఫిన్లాండ్, స్వీడన్‌ను స్వాగతిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో స్వీడన్ తన సైనిక బలగాన్ని ఎలా వినియోగిస్తుందనే దానిపై తమ స్పందన ఆధారపడి ఉంటుందని రష్యా తెలిపింది. నాటోలో చేరాలన్న అభిలాష గురించి స్వీడన్ రాయబారి తెలిపారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జాతీయ భద్రత అనేది ఆయా దేశాల సార్వభౌమాధికారమని తెలిపారు. అయితే.. ఇతర దేశాల భద్రతకు ముప్పు కలిగించకూడదని పేర్కొంది. స్వీడన్లో నాటో ఎలాంటి ఆయుధాలను మోహరిస్తుందో చూసి రష్యా బదులిస్తుందని రష్యా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.