అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగులాంబ ఆలయానికి దసరా నవరాత్రుల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దానికి సంబంధించి అధికారులు ఆలయంలోని హుండీని లెక్కబెట్టే క్రమంలో ఓ చెక్కు కనపడింది. అంతే దానిని చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
ఎందుకంటే ఆ చెక్కు మీద అక్షరాలా రూ.100 కోట్లు అని రాసి ఉంది. దీంతో హుండీ లెక్కిస్తున్న దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, ఆలయ ఈవో , సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.జోగులాంబ దేవాలయానికి రూ. 100 కోట్లు వేసే భక్తులు కూడా వస్తారా అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ చెక్కుపై ఆర్మీ జవాన్ల కోసం అని రాసి ఉంది.
భారీ విరాళం కావడంతో సిబ్బంది వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. అయితే ఆ చెక్కును చూసిన అధికారులకు డౌట్ వచ్చింది. వెంటనే సదరు చెక్ ఏ బ్యాంకుదో అని ఆరా తీశారు. అది వరంగల్‌లోని ఏపీజీవీబీ బ్యాంకుదిగా గుర్తించి ఆ బ్యాంకుకు ఫోన్ చేశారు. బ్యాంకు అధికారులు చెప్పిన వివరాలు విని అధికారులు అవాక్కయ్యారు.
హుండీలో వేసిన చెక్ వరంగల్ బ్రాంచిది అయినా.. సదరు వ్యక్తి మాత్రం ఆలంపూర్‌కు చెందిన వాడేనని తెలిసింది. అంతే కాకుండా ఆ వ్యక్తి ఖాతాలో కేవలం రూ. 23 వేలు మాత్రమే ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఆ వ్యక్తి కోసం ఆరా తీయగా అతడికి మతిస్థిమితం లేదని.. అతడిని కోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే పోలీసులు హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిసింది. దీంతో ఆలయ అధికారులు చేసేదేమీ లేక ఆ చెక్కును పక్కన పెట్టి భద్రపరిచారు.