విద్య, వైద్యం, ఆరోగ్యం అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం అసలు స్వరూపం బయటపడింది. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నామని చెప్పుకుంటూనే రాష్ట్ర ప్రజలకు కర్రు కాల్చి వాత పెట్టినట్టు చేసింది. రాష్ట్ర ఆరోగ్య శాఖలో అమలవుతున్న ఉచిత వైద్య సేవలను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న 104 అంబులెన్స్ సేవలకు స్వస్థి పలికింది.
దీంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అంబులెన్స్ సేవలను కోల్పోనున్నారు. దీంతో 104 వాహనాలను త్వరలో వేలం వేయనున్నట్టు ప‍్రభుత‍్వం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాహనాలను వేలం వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సర్కార్ ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అంబులెన్సులు అమ్మగా వచ్చిన డబ్బులను వైద్య సేవలకు ఖర్చు చేయాలనుకుంటున్నట్టు సర్కారు చెప్పింది. కాగా.. 104 అంబులెన్స్ సర్వీసులను 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప‍్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. మారుమూల ప్రాంతాల్లో బీపీ, షుగర్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి స్థానికంగా ట్రీట్మెంట్ అందించేందుకు ఈ అంబులెన్స్‌లను తీసుకువచ్చారు.
ప్రభుత్వం ఈ వాహనాల్లో ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎం, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ అసిస్టెంట్, డ్రైవర్లను నియమించింది. అయితే.. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగే అవకాశం ఉందని.. అంతేకాకుండా ప్రజలు తీవ్రంగా నష్ట పోతారని కొందరు ప్రముఖులు చెప్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకొని వెనక్కి వస్తోందా..? అలాగే ముందుకు వెళ్తోందా..? అనేది చూడాలంటున్నారు కొందరు విశ్లేషకులు.