కరోనా వేళలోనూ ప్రాణాలని పణంగాపెట్టి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు వారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఊరూరు తిరిగి వెళ్లి వైద్యసేవలు అందిస్తుంటారు. పల్లెల్లో ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తూ.. అవసరమైన మందులు పంపిణీ చేస్తూ.. ఆరోగ్య తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. అలాంటి వారు ఇప్పుడు ఆకలిదప్పులతో ఆలమటిస్తున్నారు. ఒకటీ, రెండు కాదు.. ఏకంగా ఏడు నెలలుగా వేతనాలు లేక అనేకానేక అవస్థలు పడుతున్నారు.
కొత్తగూడెం జిల్లాలో 104 వాహన సిబ్బందిగా పనిచేస్తున్న 70పైగా మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కన్నీటి గాథ ఇది. ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో వారంతా విలవిలలాడిపోతున్నారు. కుటుంబ సభ్యులకు కనీసం కడుపునిండా తిండి కూడా పెట్టలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో 104 సిబ్బందికి సమయానికే వేతనాలు వస్తున్నా.. కొత్తగూడెం జిల్లా ఉద్యోగులకు మాత్రం పైసా రావడం లేదు. వేతనాలు చెల్లించాలని ఎవరిని అడిగినా.. ఆలస్యపు నెపాన్ని ఒకరిపై, ఒకరు నెట్టివేసుకుంటూ నెలలు గడిపేస్తున్నారు. ఆరోగ్యశాఖ అధికారులను అడిగితే ఏజెన్సీ ఇవ్వలేదని.. ఏజెన్సీ ప్రతినిధులను అడిగితే ఇప్పటికే పంపించామని ఉద్యోగులని గందరగోళంలోకి నెడుతున్నారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఉద్యోగులు బాధపడుతున్నారు.
వేతనాల సంగతి ఇలా ఉంటే.. పీఎఫ్, ఈఎస్ఐల సంగతి ఇక దెవుడెరుగు. అసలు తమ పేర్లపై వాటిని జమ చేస్తున్నారో లేదో కూడా తెలియక వారు సతమతం అవుతున్నారు. కుటుంబ సభ్యులను వైద్యం కోసం ఈఎస్ఐ ఆస్పత్రులకు తీసుకెళ్తే.. తీరా అక్కడికి వెళ్లాక ఈఎస్ఐ కట్టలేదని చెప్తుండటంతో ఏం చేయాలో తెలియక దిక్కులు చూడాల్సి వస్తోంది. మరోవైపు రెండేళ్లుగా టీఏ, డీఏ,ఫుడ్ అలవెన్సులకు కూడా దిక్కులేదు. కుటుంబ అవసరాల కోసం ఇప్పటికే అయినకాడికి అప్పులు చేయడంతో.. కొత్తగా రూపాయి కూడా పుట్టడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక 104 ఉద్యోగులు మధనపడుతున్నారు.
మరోవైపు వేతనాల గురించి ప్రశ్నిస్తే.. అధికారులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఇష్టమున్నట్టుగా వేతనాల్లో కోత పెట్టడం, విధులకు హాజరైనా.. రాలేదని నమోదు చేసుకోవడం, దూర ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై పంపించడం వంటి చర్యలతో పగ సాధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు రాలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. వాళ్లే వేతనాలు ఇస్తారు తీసుకోండి అంటూ హేళనగా మాట్లాడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే వేతనాలు రాక ఇబ్బందుల్లో ఉంటే.. ఓ కంప్యూటర్ ఆపరేటర్ చేతివాటం ప్రదర్శిస్తూ.. తమను వేధిస్తున్నాడని ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. కొత్తగూడెం జిల్లా 104 సిబ్బంది సమస్యలను తీర్చాలని కోరుతున్నారు.