వృత్తి పట్ల నిబద్దత ఉంటే ఎంత అసాధ్యమైన పనినైనా సుసాధ్యం చేయొచ్చు అని నిరూపించారు కాకినాడ వైద్య సిబ్బంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న నెలలు నిండిన గర్బిణీకి సమయస్ఫూర్తితో వైద్యం అందించి.. అంబులెన్స్ లోనే పురుడు పోసి బేష్ అనిపించుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం గుమ్మరేగులకు చెందిన గంటిమళ్ల గంగలక్ష్మి(24) కి నెలలు నిండటంతో.. పురుడు కోసం బంధువులు రౌతులపూడి పీహెచ్ సీకి తీసుకెళ్లారు. ఉమ్మనీరు పోవడంతో ప్రసవం ప్రమాదకరంగా మారింది. కాకినాడ జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని పీహెచ్ సీ వైద్యులు సూచించారు.
వెంటనే బంధువులు 108 కి కాల్ చేశారు. కాల్ రావడంతో పిఠాపురం 108 సిబ్బంది హుటాహుటిన బయలుదేరారు. గంగలక్ష్మిని అంబులెన్స్ లో కాకినాడ తరలిస్తుండగా దారిలో అచ్చంపేట దాటే సరికి నొప్పులు ఎక్కువయ్యాయి. పరిస్థితి విషమించడంతో అప్రమత్తం అయిన అంబులెన్స్ సిబ్బంది ప్రసాద్.. పైలెట్ సగరం నాగేశ్వరరావులు వాహనం రోడ్డు పక్కన ఆపి అత్యవసర ప్రసవం చేశారు.
పుట్టిన వెంటనే పాప ఏడవక పోవడంతో కాస్త కంగారు పడ్డారు. అయితే 108 వాహనంలోని వైద్య సదుపాయాలు ఉపయోగించి.. ఆక్సిజన్ అందించడంతో పాప ఏడ్చింది. ఊపిరి పీల్చుకున్న సిబ్బంది… వెంటనే తల్లిబిడ్డలను అదే అంబులెన్స్ లో కాకినాడ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందడంతో ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ప్రసాద్ తెలిపారు. అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తిని పలువురు అభినందించారు. అయితే గంగలక్ష్మికి ఇది నాల్గవ ప్రసవం కావడం విశేషం.