పెద్ద సినిమాల హంగామా ముగిసింది. ఎఫ్3తో పెద్ద సినిమాలన్నీ అయిపోయాయి. ఇప్పుడన్నీ మీడియం రేంజ్ సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. వాటితో పాటు చిన్న సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. దీంతో థియేటర్ల సమస్య ఎక్కువైంది. ఫలితంగా కొన్ని చిన్న సినిమాలు వాయిదా పడుతున్నాయి. తాజాగా టెన్త్ క్లాస్ డైరీస్ అనే సినిమా కూడా ఈ లిస్ట్ లోకి చేరింది.
లెక్కప్రకారం, 24వ తేదీన ఈ సినిమా విడుదలవ్వాలి. ఆ మేరకు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అంతలోనే వాయిదా వేశారు. జూన్ 24న కాకుండా, జులై 1న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమా వాయిదాకు థియేటర్ల సమస్యే కారణమని తెలుస్తోంది.
అయితే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు కానీ, ఆ తేదీకి చాలా గట్టి పోటీ ఉందనే విషయాన్ని టెన్త్ క్లాస్ డైరీస్ మేకర్స్ మరిచిపోయినట్టున్నారు. జులై 1కి గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ సినిమా వస్తోంది. ఈ మేరకు థియేటర్లతో అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయి. దీంతో పాటు గంధర్వ, ఏనుగు లాంటి మరో 2 చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.
ఇప్పుడీ పోటీలోకి టెన్త్ క్లాస్ డైరీస్ కూడా చేరింది. అప్పటికి ఏ సినిమా వెనక్కి తగ్గుతుందో చూడాలి. అవికా గౌర్ హీరోయిన్ గా, శ్రీరామ్ హీరోగా తెరకెక్కింది టెన్త్ క్లాస్ డైరీస్. సినిమాటోగ్రాఫర్ అంజి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. వెన్నెల రామారావు, ఈ సినిమాను నిర్మించడంతో పాటు.. ఓ కీలక పాత్ర కూడా పోషించాడు.