క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అంతేకాదు, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన ‘పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదే లే’ డైలాగు దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. ఈ డైలాగుపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ చేసిన వీడియోలు.. ఇప్పటికీ సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ డైలాగ్స్ ఫీవర్ ఇప్పుడు బెంగాల్ పదో తరగతి విద్యార్థిని తాకింది. పరీక్షల్లో జవాబు పత్రంలో ‘పుష్ప.. పుష్పరాజ్.. జవాబులు రాసేదే లే’ అని రాశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో పదో తరగతి పరీక్షలు ఇటీవల ముగిశాయి. ప్రస్తుతం పేపర్లు దిద్దే ప్రక్రియ కొనసాగుతోంది. ఓ విద్యార్థికి సంబంధించిన పేపర్ దిద్దుతుండగా ఓ ఉపాధ్యాయుడు అందులో ‘పుష్ప’ డైలాగ్ ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. ఆ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ విద్యార్థి జవాబు పత్రాల్లో ‘పుష్ప’ డైలాగు తప్ప ఇంకేమీ రాయలేదని తెలుస్తోంది. ఇప్పుడు నెట్టింట ఆ ఫోటోలు తెగ హల్‌చల్ చేస్తోన్నాయి.
పదో తరగతి పరీక్షల్లో చాలా మంది విద్యార్థులు ఇలాంటి ధోరణినే కనబర్చుతున్నారు. చదువుపై ఆసక్తిలేని వారు ఇటువంటి డైలాగులు రాస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధికార పార్టీ టీఎంసీ నినాదమైన ‘ఖేలా హోబే’(ఆట ముందుంది) అనే నినాదాన్ని కూడా కొందరు విద్యార్థులు జవాబు పత్రాల్లో రాసిన విషయం తెలిసిందే. దీంతో ఇటువంటివి రాస్తే ఆ విద్యార్థుల జవాబు పత్రాలు దిద్దకూడదని అధికారులు భావిస్తున్నారు. త్వరలో 12వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిబంధనను అమలు చేయాలని యోచిస్తున్నారు. లేదంటే విద్యార్థుల్లో ఈ ధోరణి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
answer sheet me v pushpa raj🤣🤣 pic.twitter.com/3RVwDwB4to
— Manoj Sarkar (@manojsarkarus) April 4, 2022
Advertisements
కాగా, పుష్ప సినిమా ప్రభావం విద్యార్థులపై ఊహించని స్థాయిలో పడిందని ఈ ఘటన వల్ల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే, విద్యార్థి చేసిన పని మాత్రం సరికాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పదో తరగతి ఆన్సర్ పేపర్‌లో ఇలా రాయడం వల్ల విద్యార్థి తన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. విద్యార్థులు సినిమాలపై కాకుండా చదువుపై శ్రద్ధ పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.