– రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం
– ఎక్కువ నేరాలకు అదే మూలం
– ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదాయం
– కలకలం రేపుతున్న రంగారెడ్డి బాలిక సూసైడ్
– మద్యం మత్తులో తండ్రి టార్చర్
– తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బాలిక
– భార్యను కూడా పొట్టనపెట్టుకున్న నిందితుడు
రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో తండ్రి టార్చర్ తట్టుకోలేక ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ పాపం ఎవరిది? మద్యానికి బానిసలను చేస్తున్న ప్రభుత్వానిది కాదా? కేవలం ఆదాయం కోసమే మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతూ.. జనాల జీవితాల్ని నాశనం చేయడం ఎంత వరకు కరెక్ట్? అని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. నందిగామ మండలం బుగ్గోనిగూడలో పదో తరగతి చదువుతున్న మనీషా ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించగా.. తన నోట్ బుక్ లో ఇప్పటిదాకా తండ్రితో ఎదురైన ఇబ్బందులన్నీ అందులో రాసి పెట్టింది. “నాన్న.. నిన్ను నాన్న అని పిలవడనికి నాకు అసహ్యంగా ఉంది. మా నాన్న మూర్కుడు. ఇప్పటికీ నాకు నరకం చూపిస్తున్నాడు” అంటూ అందులో రాసి ఉంది.
“నాన్న అని పిలువడానికే దరిద్రంగా ఉంది ఆ పదం” అని నాలుగు సార్లు నోట్ బుక్ లో రాసిందంటే అతడు ఎంత టార్చర్ పెట్టి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. మనీషా తండ్రి నర్సింహులు మద్యం మత్తులో గత కొన్ని రోజులుగా బాలికను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అతడి టార్చర్ తట్టుకోలేక ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనీషా తల్లి లలిత ఏడాది క్రితం ఇతడి వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని చనిపోయింది. ఇప్పుడు కూతురు కూడా అలాగే చేసింది.
ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని జనాన్ని మద్యానికి బానిసలుగా మారుస్తోందని ప్రభుత్వంపై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగించడం వల్లే ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తోందని అంటున్నాయి.
నిజానికి రంగారెడ్డి జిల్లాలోని గ్రామాల్లో బెల్టుషాపుల దందా జోరుగా సాగుతోంది. గల్లీగల్లీలో మందు దొరుకుతోంది. అర్ధరాత్రి వరకు కూడా దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఎమ్మార్పీ కన్నా రేటు పెంచి మద్యంపై అదనపు లాభాలు ఆర్జిస్తున్నారు కొందరు. ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.