– కామ్రేడ్స్ అమ్మిన 10టీవీ పై సెబీలో విచారణ
– ఇప్పటికీ 84 మంది డైరెక్టర్స్!
– కొనుగోలు వ్యవహారంలో మైహోం పై నిఘా
– పదేళ్ల క్రితం జరిగిన వ్యవహరంలో మనీ లాండరింగ్
కామ్రెడ్స్ అమ్మిన 10టీవీ ఛానల్ పై సెబి విచారణ జరుగుతోంది. వాటాల విక్రయాల సమయంలో సెబి మార్గదర్శకాలను ఉల్లంఘించారని మార్కెట్ నియంత్రణ సంస్థ గుర్తించింది. 10టీవీలోకి నిధులు మళ్లించిన అభ్యుదయ బ్రాడ్ కాస్టింగ్, ప్రగతి బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు సూట్ కేసు కంపెనీలని తెలుసుకుంది. సుమారు మూడేండ్ల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత ఇటీవల అభ్యుదయ బ్రాడ్ కాస్టింగ్, ప్రగతి బ్రాడ్ కాస్టింగ్ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న రెండు రాష్ట్రాల సీపీఎం నేతలకు సెబి 3వందల పేజీల షోకాజ్ నోటీసులు అందించింది.
10టీవీ వాటాల అమ్మకం సందర్భంగా అభ్యుదయ బ్రాడ్ కాస్టింగ్, ప్రగతి బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పాల్పడిన ఉల్లంఘనలు, అవకతవకలు, మనీ లాండరింగ్ వంటి విషయాలన్నింటినీ ఎత్తి చూపింది. జూన్ 4వ తేదీన రిజిష్టర్ అయిన కంపెనీకి 3 రోజుల్లోనే లక్షలాది షేర్లను బదిలీ చేసిన విషయాన్ని నోటీసుల్లో సెబి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ విషయంపై ఆ రెండు బ్రాడ్ కాస్టింగ్ కంపెనీల డైరెక్టర్లకు పలు దఫాల్లో లేఖలు కూడా రాసింది.
లక్షలాది మందికి వాటాలు అమ్మిన సీపీఎం మాత్రం అటు సెబీకి, ఇటు కంపెనీ బోర్డుకు వాటాదారుల సంఖ్యను తప్పుగా చూపినట్టు తెలిపింది. కేవలం 418 మంది మాత్రమే వాటాదారులున్నారంటూ సీపీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని షోకాజ్ లేఖలో పేర్కొంది సెబి. 10టీవీని విక్రయించిన తర్వాత కూడా మరో 84 మంది వాటాదారులు ఆ కంపెనీల్లో ఉన్నట్లు డైరెక్టర్లు చెప్పారని లేఖలో ప్రస్తావించింది. ముఖ్యంగా సెబి నోటీసులకు రెండు బ్రాడ్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు వింత వాదనలు వినిపించారని పేర్కొంది.
మొదట బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయని కంపెనీలు పేర్కొన్నాయని చెప్పింది. ప్రారంభించదల్చుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడంతో తమ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ ఆయా సంస్థలు ఒత్తిడి తెచ్చాయని, ఆ క్రమంలో తిరిగి చెల్లించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన కార్మిక సంస్థల నుండి నిధులు సేకరించాల్సి వచ్చిందని పేర్కొన్నారని వెల్లడించింది.
కానీ, ఈ వాదనలను సెబి నమ్మలేదని తెలుస్తోంది. వాటాలు కేటాయింపు, బదిలీకి సంబంధించిన నిర్ణయాన్ని ఒకే రోజు జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో తీసుకున్నారని తెలిపింది. కనీసం ఈ నిర్ణయాలు మధ్య కొంత కాల వ్యవధి ఉండాల్సిందని అభిప్రాయం వక్తం చేసింది. కేవలం తమ కండ్లు గప్పటానికే ఆయా కంపెనీలు ఇలా షేర్ లాండరింగ్ జరిపించాయని నిర్దారించింది. ఇలా షేర్లు బదిలీ చేయడం పబ్లిక్ ఆఫర్ గైడ్ లైన్స్ కిందకు వస్తుందని తెలిపింది. మొత్తానికి తమ మార్గదర్శకాలను కంపెనీలు ఉల్లంఘించాయని సెబి నిర్ధారించింది. మరోవైపు 10టీవీ కొనుగోలు వ్యవహారంలో మైహోం పై నిఘా పెట్టినట్టు సమాచారం.0