ఢిల్లీలో ఈ నెల 1 న జరిగిన హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి 11 మంది పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నూతన సంవత్సరం నాడు అయిదుగురు నిందితులు నడుపుతున్న కారు కిందపడి అంజలీసింగ్ అనే యువతి దారుణంగా మరణించింది. సుమారు 12 కి.మీ. దూరం కారు ఆమెను ఈడ్చుకువెళ్లింది.
ఈ ఘటన జరిగిన ప్రాంత పరిధి రోహిణి జిల్లా పోలీసు స్టేషన్ కిందికి వస్తుందని, కానీ ఆ నాడు ఇంత ఘోరం జరిగినా ఈ పోలీసు స్టేషన్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని భావించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. వీరిపై చర్యలు తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాను ఆదేశించింది. దీంతో మొత్తం 11 మంది పోలీసులను శుక్రవారం సస్పెండ్ చేశారు.
వీరిలో ఇద్దరు ఎస్ఐలు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు హెడ్ కానిస్టేబుల్స్, మరి కొందరు పోలీసులు ఉన్నారు. నాడు వీరిలో ఆరుగురిని పీసీఆర్ డ్యూటీపై వేయగా.. మిగిలిన అయిదుగురికి పికెట్ల బాధ్యతను అప్పగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీరు ఒకవిధంగా దోషులేనని దర్యాప్తు జరిపిన ఢిల్లీ పోలీసు స్పెషల్ కమిషనర్ షాలిని సింగ్ తమ నివేదికలో పేర్కొన్నారు.
ఈ పోలీసుల సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఎఫ్ ఐ ఆర్ లో వీరిపై పెట్టిన కేసుల్లో మర్డర్ అభియోగాలను కూడా చేర్చాలని హోమ్ శాఖ ఆదేశించింది. ఈ కేసులో గుజరాత్ నుంచి కూడా వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు స్పాట్ నుంచి సాక్ష్యాధారాలను సేకరించారు. మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.