అధిక బరువును తగ్గించుకోవడం అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. అయితే డాక్టర్ సుక్రిత్ బాజ్‌పాయ్ అనే ప్రముఖ న్యూట్రిషనిస్టు చెబుతున్న ప్రకారం.. పలు సూచనలు పాటిస్తూ, జీవన శైలిలో మార్పులు చేసుకుంటే అధిక బరువు తగ్గడం అన్నది పెద్ద సమస్య కాదు. డాక్టర్ సుక్రిత్ తన 12 వారాల లైఫ్ స్టైల్ ప్లాన్ ద్వారా 500కు పైగా మందిని పూర్తిగా మార్చేశారు. అంతేకాదు, ఈయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్ టిప్స్ చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఈయన బరువు తగ్గేందుకు 11 సులభతరమైన టిప్స్ చెప్పారు. అవేమిటంటే…
1. సాధారణంగా మన ఇండ్లలో మిక్చర్, బిస్కెట్లు, రస్క్‌లు వంటి చిరు తిండ్లను స్నాక్స్ రూపంలో తింటుంటారు. అయితే వాటికి బదులుగా నట్స్, ప్రోటీన్ బార్స్ వంటి వాటిని తినడం వల్ల శరీరానికి పోషణ అందుతుంది. అలాగే అధిక బరువు కూడా తగ్గవచ్చు. ఆకలి నియంత్రణలో ఉంటుంది.
2. తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలి. వీటిల్లో క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని తినడం వల్ల అధికంగా బరువు పెరగకుండా ఉంటారని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
3. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల పాటు అయినా నిద్రపోవాలని డాక్టర్ సుక్రిత్ చెబుతున్నారు. నిద్ర సరిగ్గా పోకపోతే బరువు అధికంగా పెరుగుతారని అంటున్నారు. ఇక నిద్రకు ఉపక్రమించే ముందు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు ఫోన్లు, కంప్యూటర్లు, టీవీల వంటి గ్యాడ్జెట్లకు దూరంగా ఉండాలని అంటున్నారు.
4. ప్రోటీన్లు ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలి. దీని వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. అయితే ప్రోటీన్లు ఎక్కువ లభించడం లేదని అనిపిస్తే వైద్యుల సూచన మేరకు ప్రోటీన్ ఉండే ఫుడ్స్ ను ప్రత్యేకంగా తీసుకోవచ్చు. వే ప్రోటీన్ వంటివి ఈ కోవకు చెందుతాయి.
5. ప్యాక్ చేయబడిన పండ్ల రసాలతోపాటు సోడాలు, కూల్ డ్రింక్‌లను తాగకూడదు. అందుకు బదులుగా పండ్లనే నేరుగా తినాలి. దీంతో క్యాలరీలు తక్కువగా లభిస్తాయి. పోషకాలు అందుతాయి. బరువు పెరగకుండా ఉంటారు.
6. కొందరు ఆదర బాదరగా ఏదో కొంపలు మునిగిపోయినట్లు భోజనం చేస్తారు. కానీ అలా చేయడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలి. ఈ క్రమంలో విడుదలయ్యే పలు హార్మోన్లు అధిక బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయని డాక్టర్ సుక్రిత్ తెలిపారు.
7. వారంలో కనీసం 150 నిమిషాల పాటు అయినా గుండెకు వ్యాయామం అయ్యేలా కార్డియో ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. దీంతో శరీరం క్యాలరీలను ఎక్కువగా ఖర్చు చేస్తుంది. అధిక బరువు తగ్గవచ్చు.
8. తినే ఆహారంపై మనస్సు పెట్టి తినాలి. కొందరు టీవీ చూస్తూ, ఇంకొందరు బుక్స్ చదువుతూ ఆహారం తింటారు. ఇలా చేయడం వల్ల ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అన్న వివరాలు తెలియవు. ఫలితంగా ఎక్కువ ఆహారం లాగించేస్తారు. అలా కాకుండా తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. దీంతో అతిగా తినకుండా ఉంటారు. ఫలితంగా బరువు పెరగకుండా ఉంటారు.
9. నిత్యం కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని అయినా తాగాలి. నీరు తాగడం వల్ల శరీరం క్యాలరీలను ఎక్కువగా ఖర్చు చేస్తుంది. ఈ క్రమంలో బరువు తగ్గవచ్చు.
10. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. నిత్యం ఒత్తిడికి గురవడం వల్ల శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ విడులవుతుంది. దీంతో మనకు తెలియకుండానే ఎక్కువ ఆహారం తింటాం. అలా కాకుండా ఒత్తిడిని తగ్గించుకుంటే సదరు హార్మోన్లు విడుదల కాకుండా ఉంటాయి. ఫలితంగా బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
11. మన జీర్ణ వ్యవస్థలో దాదాపుగా 37 ట్రిలియన్ల వరకు మంచి బాక్టీరియా ఉంటుంది. ఆ బాక్టీరియా మనం తినే ఆహారాలను సక్రమంగా జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది. అయితే జీర్ణవ్యవస్థలో మంచి బాక్టీరియా లేకపోతే అధిక బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఆ బాక్టీరియాను పెంచుకునేందుకు నిత్యం ఆహారంలో ప్రొ బయోటిక్స్‌ను తీసుకోవాలి. అంటే పాలు, పాల సంబంధ పదార్థాలు, దోశ, ఇడ్లీ తదితర పదార్థాలను తింటే ఆ బాక్టీరియా పెరుగుతుంది. ఈ క్రమంలో బరువు నియంత్రణలో ఉంటుంది.
ఈ సూచనలు పాటిస్తే బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదని డాక్టర్ సుక్రిత్ తెలిపారు.