థర్డ్ వేవ్ లో చిన్న పిల్లలపై కరోనా తీవ్రంగా విరుచుకు పడుతుందని గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితులను పట్టి చూస్తే కరోనా రక్కసి నుంచి వారు తప్పించుకున్నట్టే కనిపిస్తోంది. అయితే పిల్లలపై ఆరోగ్యపరంగా పెద్దగా ప్రభావం చూపని కరోనా.. వారి విద్యపై దుష్ప్రభావాలను చూపిందని నిపుణులు చెబుతున్నారు. సంక్షోభం తర్వాత అత్యధిక సంఖ్యలో బాలికలు పాఠశాలలకు తిరిగి రాకపోవచ్చని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
11 మిలియన్ల మంది బాలికలు పాఠశాలలకు రాకపోవచ్చు…
11 దేశాల్లో మార్చి 2020 నుండి సెప్టెంబర్ 2021 వరకు ప్రీ-ప్రైమరీ నుండి అప్పర్ సెకండరీ వరకు ఉన్న విద్యార్థులపై ఓ సర్వే నిర్వహించారు. వారిలో 131 మిలియన్ మంది విద్యార్థులు తమ తరగతి గది బోధనా సమయాన్ని కనీసం మూడు వంతుల వరకు పూర్తిగా కోల్పోయారని గణాంకాలు చెబుతున్నాయి.
కరోనా సమయంలో పాక్షికంగా పాఠశాల మూసివేతలు, హోం లైఫ్ లో అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో భవిష్యత్ లో 100 మిలియన్ల మంది పిల్లలు చదవడంలో కనీస నైపుణ్య స్థాయి కంటే దిగువకు పడిపోతారని గణాంకాలు వివరిస్తున్నాయి. అయితే పాఠశాలలో వెనుకబడిపోవడం, మళ్ళీ విద్యలో మెరుగుపడలేమా అన్న భావనలు కలిసి అసలు విద్యను కొనసాగించాలా వద్దా అని నిర్ణయం వైపు వారిని నడిపించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నాయరు.
ఈ క్రమంలో భవిష్యత్ లో పదకొండు మిలియన్ల మంది బాలికలు పాఠశాలకు తిరిగి రాకపోవచ్చని అంచనాలు వేస్తున్నారు. దీంతో లింగ సమానత్వం కోసం చేసిన దశాబ్దాల పోరాటం తిరోగమన దిశలో ప్రయాణం చేయవచ్చని ఆందోళనలు మొదలయ్యాయి.
అసమానతలను తీవ్రతరం చేస్తున్న ఇంటర్నెట్ సౌకర్యాలు
కరోనా నేపథ్యంలో భౌతికంగా తరగతులను నిర్వహించడం కష్టంగా మారడంతో ప్రభుత్వాలు ఆన్ లైన్ విద్య వైపు చూసాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్ల మందికి ఇంటర్నెట్ సౌకర్యం లేనట్టు తెలుస్తోంది. దీంతో వీరంతా విద్యపరంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరో వైపు అధిక ఆదాయం గల దేశాల్లో 87 శాతం ఇంటర్నెట్ కవరేజ్ ఉండగా తక్కువ ఆదాయ దేశాల్లో ఇది 6 శాతం మాత్రమే ఉందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రిమోట్ లెర్నింగ్ కు సిద్ధం కాని దేశాలు..
యూనిసెఫ్ ఇటీవల రిమోట్ లెర్నింగ్ రెడినెస్ ఇండెక్స్ (ఆర్ఎల్ఆర్ఐ) అనే కొత్త సూచికను విడుదల చేసింది. రిమోట్ లెర్నింగ్‌ను అందించడానికి దేశాల సంసిద్ధతను ఎలా ఉందో ఈ సూచికత తెలియ చేస్తుంది.
ఈ జాబితాలో పిలిప్పీన్స్, బార్బడోస్, అర్జెంటీనాలు ముందు వరుసలో ఉన్నాయి. అయితే సంక్షోభ సమయాల్లో రిమోట్ లెర్నింగ్‌ని అమలు చేయడానికి 31 కంటే ఎక్కువ దేశాలు సిద్ధంగా లేవని సూచికలు వెల్లడించాయి.
అభ్యసనంతో పాటు పలు అంశాలపై ప్రభావం…
స్కూళ్ల మూసివేత పిల్లల అభ్యసంపై మాత్రమే కాకుండా వారి మానసిక ఆరోగ్యం, సంక్షేమంపైనా ప్రభావం చూపాయి. యునెస్కో విడుదల చేసిన ఓ సర్వే ప్రకారం… ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతంలో పిల్లలు సామాజిక ఒంటరితనం, పోషకాహరం అందుకోలేక, శారీరక వ్యాయామాలు లేక బాధలు ఎదుర్కొన్నారని, ఇది వారి అభివృద్దిపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపింది.
భారత్ పై ప్రభావం…
1 మరియు 2 తరగతుల్లో ముగ్గురు పిల్లల్లో ఒకరు మహమ్మారి సమయంలో వ్యక్తిగత తరగతికి హాజరు కాలేదని సర్వేలు చెబుతున్నాయి. ఆ తరగతి పిల్లల్లో దాదాపు మూడింట ఒక వంతు మందికి ఇంట్లో స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేదని వెల్లడించాయి.
ఆగస్టు 2021లో విడుదల చేసిన ఓ సర్వే ప్రకారం… 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చూస్తే గ్రామీణ విద్యార్థుల్లో్ కేవలం 8 శాతం మంది మాత్రమే ఆన్ లైన్ క్లాసులకు రెగ్యులర్ గా హాజరవుతున్నారు. 37 శాతం మంది అసలు చదవడం లేదని తేలింది.
పాఠశాలల్లో నిర్వహిమచిన ఓ సర్వే ప్రకారం… తల్లిదండ్రుల్లో మూడింట రెండు వంతుల మంది తమ పిల్లలు ఆన్‌లైన్‌లో పాఠశాల విద్యను యాక్సెస్ చేయలేకపోతున్నారని అన్నారు. చదవడం, వ్రాయడంలో నైపుణ్యాలు క్షీణించడంతో తమ పిల్లలు వెనుకబడి పోయారని పేర్కొన్నారు.
విద్యారంగ పునరుద్ధరణకు ప్రాధాన్యతనివ్వాలి
విద్యారంగంలో ఎదురైన సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోవాలని పలువురు మేథావులు, విద్యావేత్తలు చెబుతున్నారు. విభిన్న పద్ధతుల ద్వారా విద్యను అందించడానికి సమగ్ర సంసిద్ధత ప్రణాళికలు, సరైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభం తగ్గిన తర్వాత కూడా దేశాలు దూరవిద్యను కొనసాగించాలని అంటున్నారు. ప్రస్తుత సాంకేతికతను భవిష్యత్ లోనూ కొనసాగించాలని, అలా అయితే భవిష్యత్ లో మరిన్ని మహమ్మారులు వచ్చినా విద్యావ్యవస్థను బతికించుకోలగలమని చెబుతున్నారు.