బెంగుళూరులో జరిగిన ఓ విషాదం గుండెల్ని పిండేసింది. అమ్మ ఇక శాశ్వతంగా లేదని తెలియని 11 ఏళ్ళ చిన్నారి.. తన తల్లి మృతదేహంపక్కనే రెండు రోజులపాటు నిద్రపోయాడు. ఆ పసి హృదయానికి జరిగిందేమిటో తెలియదు. ఆమె నిద్ర పోతోందని అమాయకంగా అనుకున్నాడట. మృతురాలిని 44 ఏళ్ళ అన్నమ్మగా గుర్తించారు. రక్తపోటు, డయాబెటిస్ తో బాధపడుతున్న ఆమె నిద్రలోనే కన్ను మూసిందని తెలిసింది.
తన తల్లి ఇంకా నిద్ర లేవలేదని, రెండు రోజులుగా తనతో మాట్లాడడం లేదని ఆ బాలుడు తన స్నేహితులతో చెబితే వారు ఈ విషయాన్నీ తమ తలిదండ్రులకు తెలిపారు. దీంతో వారు ఇతని ఇంటికి వెళ్లి చూస్తే.. అన్నమ్మ విగతజీవిగా కనిపించింది. మూగదైన అన్నమ్మ భర్త ఏడాది క్రితం మరణించాడు. అప్పటి నుంచి తన కొడుకుని చదివించడం కోసం ఆమె ఒకరి ఇంట్లో పనిమనిషిగా పని చేస్తూ వచ్చిందని తెలిసింది.
కానీ అస్వస్థత కారణంగా రెండు రోజులుగా ఆమె పనికి వెళ్లలేకపోయింది. చివరకు అనారోగ్య కారణాలతో కన్ను మూసిందని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలియని ఆమె కొడుకు ఎప్పటిలాగే బయటకు వెళ్లి స్నేహితులతో ఆడుకుంటూ వచ్చాడు. ఈ బాలుడి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పొరుగువారు కూడా వచ్చి చూస్తే.. అసలు విషయం తెలిసింది.
తన తల్లి మాట్లాడలేదు గనుక, అలసిపోయి నిద్ర పోతోందని అనుకున్నానని ఆ చిన్నారి చెబుతుంటే విన్నవారి కళ్ళు చెమ్మగిల్లాయి. అన్నమ్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆ కుర్రాడిని అతని బంధువుల ఇంటికి పంపారు.