20 గంటల పాటు రిఫ్రిజిరేటర్ లో ఉండి ఓ 11 ఏండ్ల బాలుడు తన ప్రాణాలు కాపాడుకున్న ఘటనకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది.ఫిలిప్పీన్స్ లోని బాబే సిటీలో సీజే జాస్మే అనే అబ్బాయి తన తల్లిదండ్రులతో కలిసి వారి ఇంట్లో ఉన్నాడు.
సిటీలో శుక్రవారం ఒక్క సారిగా మెగీ తుఫాన్ మొదలైంది.దీంతో భారీ వర్షాలు కురిశాయి. చాలా చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. భారీ వర్షాలకు చుట్టు పక్కల ఉన్న నదులు ఉప్పొంగి జాస్మీ ఉంటున్నప్రాంతంలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది.
దీంతో ప్రాణాలను రక్షించుకునేందుకు అతని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కానీ జాస్మీ తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఇంట్లోని రిఫ్రిజిరేటర్ లో దాక్కున్నాడు.
వరద నీటికి రిఫ్రిజిరేటర్ కొట్టుకుని పోయింది.చివరకు నది ఒడ్డున ఒక ప్రాంతంలో చెట్టు మొదట్లో రిఫ్రిజిరేటర్ చిక్కుకుంది. అయితే ఆ సమయంలో అటుగా వచ్చిన రెస్క్యూ సిబ్బంది దాన్ని గుర్తించారు.
రిఫ్రిజిరేటర్ డోరు తెరవగా అందులో జాస్మే వారికి కనిపించాడు. అందులో అతను 20గంటల పాటు ప్రయాణించినట్టుగా వారు గుర్తించారు.అయితే డోరు తీసిన వెంటనే మొదట తనకు ఆకలి వేస్తోందని జాస్మే చెప్పినట్టు అధికారులు వెల్లడించారు.